Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా సెరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఐసీఎంఆర్
భువనేశ్వర్ : కరోనాకు వ్యతిరేకంగా ఒడిశా జనాభాలో 73 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన తాజా సెరో సర్వేలో వెల్లడైంది. ఐసీఎంఆర్, ఒడిశా కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఈ సర్వేను నిర్వహించాయి. ఈ నివేదిక వివరాల ప్రకారం.. ఒడిశా జనాభాలో 73 శాతం మందిలో కరోనా యాంటీబాడీస్ ఉన్నాయి. అలాగే, ఆరోగ్య కార్యకర్తల్లో 93 శాతం మందిలో కోవిడ్-19 వ్యతిరేక ప్రతిరోధకాలు అభివృద్ధి చెందాయి. సంబల్పూర్, సుందర్‌గఢ్, జర్సుగూడ, కియోంజర్, ఖుర్దా, పూరి, బాలాసోర్, మయూర్భంజ్, జాజ్‌పూర్, కంధమాల్, కలహండి, నబరంగ్పూర్లలో ఈ సెరో సర్వేను నిర్వహించారు. దీనిపై భువనేశ్వర్ ఆర్ఎంఆర్సీ డైరెక్టర్ సంఘమిత్ర పాటి మాట్లాడుతూ.. మొత్తం 5,796 మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరిశీలించగా.. 4,247 మందిలో యాంటీబాడీస్ ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అలాగే, 1,312 ఆరోగ్య కార్యకర్తల నుంచి శాంపిల్స్ సేకరించగా.. 1,232 మందిలో కరోనా ప్రతిరోధకాలు అభివృద్ధి జరిగినట్టు గుర్తించారు. ''మొత్తం 73.5 శాతం మందిలో కరోనా ప్రతిరోధకాలు, ఆరోగ్య కార్యకర్తల్లో 93.9 శాతం మందిలో యాంటీబాడీస్ గుర్తించాము. అత్యధికంగా ఖుర్దా జిల్లాలో అత్యధికంగా 80 శాతం మందిలో యాంటీబాడీస్'' ఉన్నాయి. 68 శాతంతో ఆ తర్వాతి స్థానంలో జజ్పూర్, మయూర్భంజ్, జర్సుగూడలు ఉన్నాయి. వయస్సుల వారీగా చూస్తే.. 6-10 ఏండ్లలోపు వారిలో 70 శాతం, 1-18 ఏండ్లున్న వారిలో 74 శాతం, 19-44 ఏండ్లున్న వారిలో 75 శాతం, 45-60 సంవత్సరాలున్న వారిలో 72 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి. 60 ఏండ్లకు పైబడిన 66 శాతం మందిలో కరోనా ప్రతిరోధకాలు గుర్తించారు. యాంటీబాడీస్ గుర్తించిన పెద్దలలో 66.5 శాతం మంది కనీసం కోవిడ్-19 మొదటి డోసును తీసుకున్న వారు ఉన్నారు. అలాగే, 25.6 శాతం మంది పూర్తిగా రెండు డోసులు తీసుకున్నారని ఈ సర్వే గుర్తించింది.