Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెగ్యులేటరీ బాడీపై చర్యలేందుకు తీసుకోవటంలేదు..
- అటవీ శాఖతీరుపై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతీరుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. తాము చర్యలకు ఆదేశించేంతవరకూ అధికారుల్లో చలనం రాదా? అని ప్రశ్నించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్తో కూడిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అక్టోబర్ 1 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఎన్జీటీ ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై ఎన్జీటీలో ఆంధ్రప్రదేశ్ తన వాదనలు వినిపించింది.
డీపీఆర్ కోసమే పనులు చేశామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వెంకట రమణి పేర్కొన్నారు. చేసిన పనులు దాయలేదని ఎన్జీటీకి ఏపీ ప్రభుత్వం న్యాయవాది స్పష్టం చేశారు. డీపీఆర్ కోసం ఎంత పని చేయాలో ఎక్కడా విధివిధానాలు లేవని ఈ సందర్భంగా పేర్కొన్నారు. డీపీఆర్ పనుల్లో ఎక్కువతక్కువలు ఉంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పుదోవ పట్టిస్తున్నారనడం సరికాదన్నారు. పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి అధికారులను జైలుకు పంపే అధికారం ఎన్జీటీకి లేదనీ, కేంద్రమే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. చట్టంలోనూ ఎన్జీటీ అధికారులను జైలుకు పంపొచ్చా అనే అంశంపై స్పష్టత లేదని తెలిపారు. కేంద్ర పర్యావరణ శాఖకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొనే అధికారం ఉందన్నారు. ఉల్లంఘనలపై శిక్ష, జరిమానా విధించాలంటూ పిటిషనర్ కోరుతున్నారనీ, ఎన్జీటీకి అధికారం లేనందున పిటిషన్ కొట్టివేయాలని వెంకట రమణి కోరారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాధ్ దాస్ పదవీ విరమణ అయినా అక్రమాలు నిజమని తేలితే చర్యలు తప్పవని ఎన్జీటీ హెచ్చరించింది. తన హయాంలో జరిగిన పనులకు ఆదిత్యనాధ్ దాస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్జీటీ స్పష్టం చేసింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను 30కి వాయిదా వేసింది.