Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2017లో అక్రమ బంగ్లా నిర్మించారని ఆర్టీఐ సమాధానంలో వెల్లడి
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ గతంలో పీడీపీి-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో తన బంగ్లాను అక్రమంగా, చట్టాలకు విరుద్ధంగా నిర్మించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఒక ఆర్టీఐ సమాధానంలో వెల్లడైంది. మందుగుండు సామగ్రి డిపోకు సమీపంలో నిర్మించిన భవనంపై నిర్మాణ సమయంలో ఆర్మీకి చెందిన అధికారులు అభ్యంతరం చెప్పినా ఆయన పెడచెప్పిన పెట్టారు. 2016 నుంచి 2020 మధ్య జమ్ము ప్రాంతంలోని బాన్, పంజ్రైన్ గ్రామాల్లో అక్రమ భవన నిర్మాణాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరుతూ ముజఫర్ అలీ అనే న్యాయవాది ఒకరు ఆర్టిఐ కింద దరఖాస్తు చేశారు. బాన్ గ్రామంలో నిర్మల్ సింగ్ నిర్మించిన భవనం అక్రమమని గుర్తించినా జమ్ము డెవలప్మెంట్ అథారిటీ (జేడీఏ) అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కలెక్టర్ కుసుం చిబ్ అనే అధికారి సమాధానంలో పేర్కొన్నారు. బాన్ గ్రామంలో భారత ఆర్మీకి చెందిన మందుగుండు సామగ్రి డిపోకు సమీపంలో 2017లో నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో 2017లో ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించారని అధికారులు తెలిపారు. ఆర్మీకి చెందిన నిర్మాణాలకు వెయ్యి గజాల పరిధిలో ఇతర నిర్మాణాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ ఉన్నప్పటికీ, డిపోకు 580 గజాల సమీపంలోనే సింగ్ తన భవనాన్ని నిర్మించాడని అధికారిక రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ వెయ్యి గజాల జోన్‌ను ఉగ్రవాదుల నిరోధకంగా, పౌరుల ప్రాంతాలకు భద్రత కూడా కల్పిస్తుంది. ఈ భవన నిర్మాణం ఆర్మీ డిపో భద్రతపై ఫ్రభావం చూపడంతో పాటు సమీప ప్రాంతాల్లో నివసించే పౌరుల రక్షణకు భంగం వాటిల్లుతుందని పేర్కొంటూ అ సమయంలో ఆర్మీ 16 కార్ప్స్ కమాండర్‌గా ఉన్న సరన్జీత్ నిర్మల్ సింగ్‌కు లేఖ రాశారు. ఈ నిర్మాణం వర్క్స్ ఆఫ్ డిఫెన్స్ యాక్ట్-1903ను ఉల్లంఘించేదిగా ఉందని పేర్కొంటూ ఆర్మీ అధికారులు జమ్ముకాశ్మీర్ ప్రభుత్వానికి మూడు సార్లు ఫిర్యాదు చేసినా, పోలీసులను ఆశ్రయించినా ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం.