Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్'ను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్'ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మిషన్‌లో భాగంగా దేశంలో ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ ఐడీ కేటాయిస్తామని, ఇది వైద్య సదుపాయాలు పొందడాన్ని సులభతరం చేస్తుందని వెల్లడించారు. దీనిలో వ్యక్తికి సంబంధించి అన్ని హెల్త్ రికార్డులు ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో ఆరోగ్య సదుపాయాల బలోపేతానికి గత ఏడేండ్లుగా కొనసాగుతున్న డ్రైవ్ ఈ మిషన్ ద్వారా కొత్త దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు. 'ఎయిమ్స్ మరియు ఇతర ఆధునిక ఆరోగ్య సంస్థల సమగ్ర నెట్‌వర్క్‌ను దేశంలో స్థాపిస్తున్నామని, ప్రతి మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజీని స్థాపించే పని జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో కూడా వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ పథకాన్ని పైలట్ దశలో భాగంగా ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్‌డయ్యు, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో అమలుచేయనున్నారు. మోడీ తన ప్రసంగంలో కోవిన్ వైబ్‌సైట్ గురించి ప్రస్తావించారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీని పాత్ర చాలా కీలకమైనదని, జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 86 కోట్ల డోసులకు పైగా అందించామని పేర్కొన్నారు. హెల్త్ ఐడీ పౌరుడి హెల్త్ అకౌంట్‌గా కూడా ఇది ఉపయోగపడుతుందనీ, దీని ఆధారంగా ప్రతిఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారని పీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎవరైనా భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడి చికిత్స, మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చిన సమయంలో ఈ డిజిటల్ ప్రొఫైల్ ఉపయోగపడుతుందని, ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఐడీ ఎంటర్ చేయగానే రోగి ఆరోగ్య సమాచారం వైద్యులకు తెలుస్తుందని తెలిపింది. కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుందని తెలిపింది. అంతకుముందు ఈ కార్యక్రమం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుఖ్ మాండవీయ మాట్లాడుతూ గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈ ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ పథకాన్ని ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమం ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందన్నారు.