Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ కేసులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ కేసులు వెనక్కి
- బలహీన వర్గాలకు దక్కని న్యాయం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. సోమవారం సుప్రీం కోర్టులో తమ కేసులను అత్యవసరంగా జాబితా చేయాలని న్యాయవాదులు అడిగినందుకు జస్టిస్ ఎన్వి రమణ స్పందించారు. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభావితం చేసే క్రిమినల్ అప్పీల్లతోనే కోర్టు అధిక భారం పడుతుండగా, ప్రధాన కంపెనీలు తమ వాణిజ్య కేసులను ప్రాధాన్యత విచారణ కోసం పేర్కొనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ విషయాలు మాత్రమే ప్రాధాన్యత జాబితాను ఇవ్వకుండా ఉండేలా ప్రస్తావించే వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్నట్టు చెప్పారు. ''మేము వ్యవస్థను క్రమబద్ధీకరిస్తాం. ఈ కార్పొరేట్ వ్యక్తులందరూ వచ్చి వారి విషయాలను ప్రస్తావించడం మొదలు పెడతారు. అప్పుడు ఇతర విషయాలు వెనక్కి వెళ్లిపోతాయి. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ అప్పీళ్లు, ఇతర కేసులు కూడా ఉన్నాయి. మేము ఇతర వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. బలహీన వర్గాల ప్రజలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి'' అని సీజేఐ అన్నారు. సుప్రీం కోర్టులో 2021 సెప్టెంబర్ 4 నాటికి మొత్తం 69,956 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో 51,381 స్వీకరించే అంశాలు, 18,575 సాధారణ విచారణ అంశాలు. సుప్రీం కోర్టు ముందు 446 రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వాటిలో 49 మాత్రమే ప్రధానమైనవి. మిగిలిన 397 అనుసంధాన పిటిషన్లుగా ఉన్నాయి.
చివరి నిముషంలో మార్పులెలా చేస్తారు ?
నీట్ సూపర్ స్పెషాలిటీ-2021 పరీక్షా పద్ధతిలో చివరి నిముషంలో మార్పులు చేయడం పట్ల సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించింది. ''యువ డాక్టర్లను, ఏ మాత్రమూ సున్నితంగా వ్యవహరించని అధికారుల దయా దాక్షిణ్యాలకు వదిలిపెట్టలేం, వారిని ఫుట్బాల్లాగా చూడలేం'' అని కేంద్రంతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బిఇ), నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి)లను ఉద్దేశించి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. నవంబరు 13, 14 తేదీల్లో నీట్-ఎస్ఎస్ జరగనుంది. జులై 23న పరీక్ష తేదీలు ప్రకటించగా, ఆగస్టు 31న పరీక్షా పద్ధతిలో మార్పులను ప్రకటించారు. బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న మాట్లాడుతూ, పరీక్షా పద్ధతికి అనుగుణంగా విద్యార్ధుల బోధనా పద్ధతి కూడా వుండాలని వ్యాఖ్యానించారు. చివరి నిముషంలో పరీక్షా పద్ధతిలో మార్పు చేయడం వల్ల విద్యార్ధులు ఇబ్బందుల పాలవుతారని అన్నారు. ఈ ఏడాదే ఈ మార్పులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని, పైగా పరీక్షల తేదీని ప్రకటించిన తర్వాత ఎలా చేశారని జస్టిస్ చంద్రచూడ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇటువంటి పరీక్షలకు విద్యార్ధులు నెలల తరబడి సన్నద్ధమవుతారు. కేవలం మీకు అధికారం వుందనే కారణంతో ఇలా వ్యవహరిస్తున్నారు. దీనిపై దృష్టి సారించాల్సిందిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మాట్లాడండి అని చంద్రచూడ్ కోరారు. 40మందికి పైగా డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ సందర్భంగా పై వ్యాఖ్యలు వెలువడ్డాయి. మెడిసిన్‌లో ప్రత్యేకించి ఒక విభౄగానికి అనుకూలంగా ఈ మార్పులు చేశారంటూ ఆ డాక్టర్లు వాదించారు. మూడేళ్ళుగా తాము ఈ పద్ధతిని పాటిస్తున్నామని, మార్పులు ఏమైనా చేయాలంటే కనీసం ఆరు మాసాలు ముందుగా చేయాలని కోరారు.