Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రమంగా తగ్గుతున్న ఉత్పత్తి
- కాశ్మీర్లో రైతుల కష్టాలు
జమ్మూకాశ్మీర్ : జమ్మూకాశ్మీర్‌లో వాల్నట్ పరిశ్రమకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రంగం నష్టాన్ని ఎదుర్కొంటున్నది. దీంతో వాల్నట్ రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారత్‌లోని వాల్నట్ ఉత్పత్తిలో దాదాపు 98 శాతం జమ్మూకాశ్మీర్ నుంచే ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఏడాదికి 89వేల హెక్టార్లలో దాదాపు 2.66 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుంది. ప్రతి ఏడాదీ ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా కార్డ్బోర్డ్ బాక్సులు, గన్నీ బ్యాగుల్లో వాల్నట్ ఎగుమతి అవుతున్నది. అయితే, కాలిఫోర్నియా, చిలీ దేశాల నుంచి భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్న వాల్నట్లు.. ఇక్కడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కాశ్మీర్ వాల్నట్ ఇండిస్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఫలితంగా కాశ్మీరీ వాల్నట్లకు డిమాండ్ తగ్గింది. రేటు పడిపోయింది. దీంతో కాశ్మీర్‌లోని వాల్నట్ రైతులు, ఎగుమతిదారులు ఆందోళనలో ఉన్నారు.
అధిక నాణ్యత లోపించడం, పేలవమైన యంత్రాంగం, సుదీర్ఘ సమయం.. ఇలా పలు అంశాలు జమ్మూకాశ్మీర్ వాల్నట్ రైతులకు శాపంగా మారాయి. ఏటికేడు జమ్మూకాశ్మీర్‌లో వాల్నట్ ఉత్పత్తి తగ్గిపోతున్నది. '' వాల్నట్ ఉత్పత్తి రోజురోజుకూ తగ్గిపోతున్నది. ఈ కారణంతో మా చిన్నారులూ భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లలేరు. ఉత్పత్తి ఒక్కటి మాత్రమే కాదు.. రేట్లు, డిమాండ్ కూడా పడిపోయింది. లేబర్ ఖర్చులూ పెరిగాయి'' అని నూర్పొరా ట్రాల్‌కు చెందిన వ్యాపారి ఘులామ్ అహ్మద్ దార్ వాపోయాడు.
భారత్‌లోని అన్ని రకాల వాల్నట్లను జమ్మూకాశ్మీర్ ఉత్పత్తి చేస్తున్నది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లు కూడా వాల్నట్ను ఉత్పత్తి చేస్తున్నాయి. భారత వాల్నట్ ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇతర యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, కొన్నేండ్ల నుంచి ఎగుమతులు క్రమంగా తగ్గడం ఆందోళనకరం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 1,648.26 మెట్రిక్ టన్నుల వాల్నట్ ఎగుమతి భారత్ నుంచి జరిగింది. దీని విలువ రూ. 52.77 కోట్లు. అయితే, ఇది 2015-16లో భారత్ ఎగుమతి చేసినదానిలో (3,292 మెట్రిక్ టన్నులు) సగం కంటే తక్కువ కావడం గమనార్హం.
అయితే, యంత్రాంగం లోపం కారణంగానే ఇక్కడి వాల్నట్ ఇండిస్టీకి ఇలాంటి కష్టాలని నిపుణులు వివరించారు. వాల్నట్ చెట్లు ఫలాలను ఇవ్వడానికి కనీసం 13 నుంచి 15 ఏండ్ల కాలం అవసరం.
అయితే, ఈ దీర్ఘకాలం కూడా ఒక అవరోధమేనని పెంపకందారులు, నిపుణులు తెలిపారు. అంతేకాకుండా, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ కూడా తమను కోలుకోకుండా చేస్తున్నదని వాపోయారు. అయితే, ఇక్కడి రైతులకు తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే ఎక్కువ నాణ్యత కలిగిన మొక్కలను ప్రభుత్వం అందించాలని నిపుణులు సూచించారు. నిర్ధిష్ట రకాలను పెంచే వాల్నట్ తోటలనూ ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. సాగు విస్తీర్ణాన్ని పెంచాలని తెలిపారు. పంటకోతకు ముందు, తర్వాత రైతులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్దతులు పాతకాలం నాటివనీ, దీంతో ఉత్పత్తి, నాణ్యత తగ్గుతున్నదని నిపుణులు తెలిపారు. కాశ్మీర్‌లోని అనంతనాగ్ (ఇస్లామాబాద్), షోపియాన్, కుప్వారా ప్రాంతాలలో వాల్నట్ సాగు అధికంగా ఉంటుంది.