Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో వణుకుతున్న జిల్లాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలు అస్తవ్యస్తం
- విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
- నీటమునిగిన విశాఖ విమానాశ్రయం
- వంశధార, నాగవళి నదులకు వరద ముప్పు
విజయనగరం : గులాబ్ తుపాను ఐదుగురిని బలిగొంది. మృతుల్లో విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు, విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపిలేని భారీ వర్షాలు పడ్డాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లాలో తుంపర్లు పడ్డాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లాలో మొత్తం 438 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అధికారులు ఇప్పటివరకు 129 స్తంభాలను పునరుద్ధరించారు. 246 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా 105ను సరిచేశారు. జిల్లా వ్యాప్తంగా 33/11 కెవి సబ్స్టేషన్లు దెబ్బతినగా 103ను పునరుద్ధరించారు. మంగళవారం నాటికి గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్‌ను పునరుద్ధరించనున్నట్లు కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 361 కిలోమీటర్ల మేర నేలకొరిగిన చెట్లను అగ్నిమాపకశాఖ సిబ్బంది తొలగించి ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరించారు. ఒక్క బూర్జ మండలంలోనే 16 ఇళ్లు కూలిపోగా, కోటబొమ్మాళి ఇతర మండలాల్లోనూ ఇళ్లు ధ్వంసమయ్యాయి. జి.సిగడాం మండలంలో జెడ్పి హైస్కూల్ ప్రహరీ కూలిపోయింది. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగవళి వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది.
విజయనగరం జిల్లా అంతటా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు వీచిన భీకర గాలులు, కురిసిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మక్కువ మండలం వెంకట బైరిపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దుక్క సింహాచలం 50 గొర్రెలపాటు సీతానగరం మండలం కొత్తవలస ఆనకట్ట పరిధి సువర్ణముఖి నది ప్రవాహం మధ్యలో చిక్కుకున్నాడు. ఆనకట్టలోని పడుకు (రాయి)పై ఉన్న ఆయనను రక్షించేందుకు విశాఖ నుంచి హెలికాప్టర్‌ను రప్పించే ఏర్పాట్లు అధికారులు చేశారు. గాలుల తీవ్రతకు తీరప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటిరేగల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. సుమారు 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గజపతినగరంలో 61 మందిని, తెర్లాం మండలం జి.గదబవలస నుంచి 18 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గజపతినగరం పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పరిశీలించారు.
విశాఖ నగరంపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 94వ వార్డు పరిధి అప్పలనర్సయ్య కాలనీ శివారు ప్రాంతంలో బాత్రూం గోడ కూలి డి.భావన (37), 97వ వార్డు పరిధి సుజాతనగర్ గిరిప్రసాద్ నగర్లో రేకుల షెడ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఐదేళ్ల బాలుడు హేమంత్ మృతి చెందాడు. జివిఎంసి పరిధిలోని 88 లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలో నీరు చేరింది. మేఘాద్రి గెడ్డ పూర్తిగా నిండి గేట్లు ఎత్తివేయడంతో విశాఖ విమానాశ్రయం నీట మునిగింది. గ్రామీణ ప్రాంతాలోనూ, ఏజెన్సీలోనూ భారీ వర్షాలు పడ్డాయి. పంటలు నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతంలో 13 ప్రాంతాలలో చెట్లు విరిగి పడ్డాయని, 28 చోట్ల రోడ్లు మీద నీరు ప్రవహించిందని, సుమారు 289 కిలో మీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నాయని ఆర్అండ్బి ఎస్ఇ తెలి పారు. అనంతగిరి మండలంలోని కెకె.లైన్‌పై బొర్రా, చిమిడిపల్లి 70/13-14-టిపి మార్గ మధ్యలో కొండచరి యలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు వాటిని తొలగించి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగేలా చేశారు.
తూర్పుగోదావరి గడిచిన 24 గంటల్లో 76.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కడియంలో అత్యధికంగా 132.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 11 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
పశ్చిమగోదావరి జిల్లాలో 95.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు జిల్లాలో 45,731 ఎకరాల్లో వరి, 118 ఎకరాల్లో పత్తి, 233 ఎకరాల్లో మినుము, 155 ఎకరాల్లో వేరుశనగ, 15 ఎకరాల్లో మొక్కజొన్న, పది ఎకరాల్లో చెరకు, వందలాది ఎకరాల్లో కూరగాయల పంటలు ముంపు బారిన పడ్డాయి.
కృష్ణా జిల్లాలో గడిచిన 24 గంటల్లో 44.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 13 మండలాల్లో 15,849 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
గుంటూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజూము నుంచి మధ్యాహ్నం వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. అమరావతిలో అత్యధికంగా 42.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మిర్చి పొలాల్లోకి నీరు చేరింది.
వరద బాధితులకు సిపిఎం ఆపన్న హస్తం
విశాఖ నగరంలోని పెదగంట్యాడ హౌసింగ్ బోర్డు కాలనీ, రిక్షా కాలనీ, బర్మా కాలనీలు ముంపునకు గురయ్యాయి. ముంపు కాలనీల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు పర్యటించారు. వంట లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను గుర్తించి సిపిఎం ఆధ్వర్యాన వెయ్యి మందికి సోమవారం మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు.