Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటీష్ పాలనను తలపిస్తోంది : మధు (సీపీఐ(ఎం)
- విశాఖ ఉక్కును పరిరక్షించుకుంటాం : రామకృష్ణ (సీపీఐ)
- బీజేపీికి ప్రజాగ్రహం తప్పదు : శైలజానాథ్ (కాంగ్రెస్)
అమరావతి : సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, అధిక ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా సోమవారం ఏపీ వ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌లో వామపక్ష పార్టీలతోపాటు కాంగ్రెస్, టీడీపీ, రైతు, కార్మిక, ప్రజాసంఘాలు భాగస్వాములయ్యాయి. వైసిపి బంద్‌కు సంఘీభావం తెలిపింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ దగ్గర వామపక్ష, కాంగ్రెస్, టీడీపీ, సీఐటీయూ ఏఐటీయూసీి, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, తదితర కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. అనంతరం బస్‌స్టేషన్ నుంచి జాతీయ రహదారిపైన జోరు వానలో సైతం నేతలు ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక బరితెగించి ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచేసిందని, బ్రిటీష్ పరిపాలన తలపించేలా మోడీ పాలన సాగుతోందని విమర్శించారు. పార్లమెంట్లో అత్యధిక స్థానాలున్నాయనే ధీమాతో రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతోం దని అన్నారు. అదానీ, అంబానీలకు దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెడుతోందన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించేదాకా ఈ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ అంబానీ, అదానీకి మోడీ కారుచౌకగా కట్టబెడుతున్నాడని విమర్శించారు. మానిటైజేషన్ పేరుతో అన్ని ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌పరం చేస్తున్నారని, కారుచౌకగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ప్రజలంతా వ్యతిరేకించారన్నారు. పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ప్రజల ఆస్తులను వరుసగా విక్రయించే కార్యక్రమానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇది ప్రజలను నిలువునా ముంచే ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దోపిడీకి పాల్పడుతోందన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మూడు వ్యవసాయ నల్ల చట్టాలు ఉపసంహరించుకోవడమా, గద్దె దిగడమా మోడీ తేల్చుకోవాల్సి వుంటుందని అన్నారు. వ్యవసాయ నల్లచట్టాల రద్దుతోపాటు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఉపసంహరించాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, లేబర్ కోడ్లు ఉపసంహరించు కోవాలని బంద్ ద్వారా దేశం కోరుతోందన్నారు. బంద్ జాతీయ ఉద్యమంలా కొనసాగుతోందని, ఇదొక మలుపని తెలిపారు. సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కె.పోలారి, సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, సీఐటీయూ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం విజ యవాడ లెనిన్ సెంటర్లో రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, కౌలు రైతుల సంఘం నాయకులు పి.జమలయ్యతోపాటు వామ పక్ష పార్టీల నాయకులు, రైతు, విద్యార్థి, కార్మిక, ప్రజా సం ఘాల నేతలు నిరసన తెలిపారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడారు. ధనలక్ష్మి, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
వైసిపి హర్షం
సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై రైతులు, రైతుసంఘాలు చేపట్టిన భారత్‌బంద్ విజయవంతం కావడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవిఎస్ నాగి రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతాంగ సమస్యలపై జరిగిన ఈ ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా రాష్ట్రంలో వైసిపి సంఘీభావం ప్రకటించిందని పేర్కొన్నారు.
బంద్‌కు సహకరించిన వారికి ధన్యవాదాలు : వడ్డే
రైతు, వ్యవసాయ, జాతి వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లులు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం జరిగిన చారిత్రాత్మక భారత్‌బంద్‌ను జయప్రదం చేసిన ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు కమిటీ రాష్ట్ర కన్వీనర్, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. బంద్‌కు సంఘీభావం, మద్దతు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలని కోరారు.
మోడీ సర్కారు జాతి వ్యతిరేక చర్యలపై విస్తృత ప్రచారం : పుణ్యవతి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న జాతి వ్యతిరేక చర్యలపై ప్రజల్లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి అన్నారు. విజయవాడలో బంద్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. మోడీ నిరంకుశ విధానాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఏపీలో విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు పోరాటాలు జరుగుతున్నా, మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రక్రియను కొనసాగించడం దుర్మార్గమన్నారు. మోడీ చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరని, భవిష్యత్తులో బుద్ది చెబుతారని, దీనికి బంద్ విజయవంతం కావడమే నిదర్శనమని తెలిపారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి అజరుకుమార్, ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమ లయ్య, పిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు.