Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దెబ్బతిన్న డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లు
- ఆరునెలల్లో నాలుగు రాష్ట్రాల బీజేపీ సీఎం ల మార్పు
- ఎన్నికల ముందు జీర్ణించుకోలేకపోతున్న కాషాయ అధిష్టానం
పాతసీసా కొత్తసారా అన్నట్టుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పాలకులు ప్రవేశపెట్టిన పథకాలకు పేరుమార్చారే తప్ప, కొత్తగా దేశానికి కానీ, దేశప్రజలకు కానీ ఒరిగేందేమీ లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక నినాదాన్ని వినిపించేది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఒకేపార్టీ అధికారంలో ఉంటే..అభివృద్ధి సమన్వయంతో పరుగులు తీస్తుందని ప్రచారం చేసుకునేది. ఈ విధానాన్ని కూడా బీజేపీ ఫాలోఅవుతోంది. అధికారంలో ఉన్నా...చెప్పుకున్న రెండు చోట్లా అభివృద్ది ఎవరికీ కానరావటంలేదు. ముందు కాషాయపార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చటమే పెద్ద తలనొప్పిగా మారింది. ఏకంగా ఆరునెలల్లో బీజేపీ పాలిత నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను మార్చిన తర్వాత..మిగిలిన రాష్ట్రాల్లోని సీఎంల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేకాదు ఎన్నికల ముందు ఇలా దఫదఫాలుగా మారుస్తున్న తీరు బీజేపీ కొంపకొల్లేరు చేస్తున్నదన్న వాదనలు ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: మోడీ 'డబుల్ ఇంజిన్ గవర్నమెంట్' ఫార్ములా దారుణంగా దెబ్బతిన్నది. అక్కడి పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. గత ఆరు నెలల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల వేగవంతంగా పీకేశారు. ఇక ఈ రాష్ట్రాలలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు పూర్తిగా అసమర్థంగా ఉన్నాయని నిరూపించాయి. ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికల కోసం తన పార్టీ ప్రచారానికి ప్రధాని మోడీ వెళ్లినప్పుడు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబుల్ ఇంజిన్ కి సర్కార్ అంటే కేంద్రంలో, రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండాలనేవారు. ఎన్నికల ర్యాలీలలో మోడీ మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే.. రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందనీ, పనుల్లో ఎలాంటి ఆటంకం ఉండదని చెబుతూనే ఉన్నారు.
వాస్తవానికి ఈ విజ్ఞప్తి అప్రజాస్వామికం . దేశం సమాఖ్య నిర్మాణానికి, ప్రధాని పదవికి ఉన్న గౌరవానికి కూడా వ్యతిరేకం. అయినా అనేక రాష్ట్రాలలో ఆయన చేసిన విజ్ఞప్తిపై ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు, దీని కారణంగా పలు రాష్ట్రాలలో బీజేపీ సర్కార్లు ఏర్పడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లోని ఓటర్లు మోడీ వాదనను తిరస్కరించి, బీజేపీకి ప్రతిపక్షంలో కూర్చోమని ఆదేశాలు ఇచ్చారు. కానీ అలాంటి రాష్ట్రాలలో అడ్డదారిలో ఎమ్మెల్యేలకు ఎరవేసి...తద్వారా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ తమ పార్టీ లేనిచోట ఇప్పటికీ పీఠాలు దక్కించుకోవటానికి వెనుకాడటంలేదు.
హైజాక్ చేశాకే ....
మధ్యప్రదేశ్, బీహార్, కర్నాటక, గోవా, మణిపూర్, హర్యానా మెజారిటీని హైజాక్ చేయడం వల్లే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాజస్థాన్, మహారాష్ట్ర ,జార్ఖండ్‌లో మాత్రం అలాంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ అక్కడ కాషాయపార్టీ విజయం సాధించలేకపోయింది.. అయితే.. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మాత్రం ఇప్పటికీ తమ ఆశను వదులుకోలేదన్న సంకేతాలిస్తున్నది.
అసమర్థత పాలన వల్ల...
గత ఆరు నెలల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రాష్ట్రాలలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు పూర్తిగా అసమర్థంగా ఉన్నాయని రుజువయ్యింది. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉండటమే కాకుండా, పార్టీ కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వాల పట్ల సంతోషంగా లేరని నిఘా నివేదికలు పార్టీ హైకమాండ్‌కు చేరాయి. ఇప్పటివరకు బీజేపీ ముఖ్యమంత్రులను మార్చిన రాష్ట్రాలలో అసోం, ఉత్తరాఖండ్, కర్నాటక , గుజరాత్ ఉన్నాయి.
మోడీ సొంత రాష్ట్రం నుంచే...
ఇక ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే, 'డబుల్ ఇంజిన్ కి సర్కార్' రాష్ట్రాలలో ముఖ్యమంత్రిని మార్చే ప్రక్రియ ఐదేండ్ల కింద.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచే షురూ అయ్యింది. ఈ రాష్ట్రంలో... మోడీ దాదాపు పన్నెండున్నర ఏండ్లపాటు సీఎంగా ఉన్నారు. 2014 లో... అతను ప్రధాని అయిన ఏడాది తర్వాత.. రాష్ట్రంలో సామాజిక, రాజకీయ తిరుగుబాటు ప్రారంభమైంది. 2015 ఆగస్టు... పటేల్ వర్గం బీజేపీకి బలమైన మద్దతుదారుగా పరిగణిస్తారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. అప్పుడే మోడీకి దడ మొదలైంది.
ఉద్యమంలో విస్తృత హింస...
సుదీర్ఘకాలంపాటు కొనసాగిన.. పటేల్ ఉద్యమ సమయంలో విస్తృత హింస జరిగింది. కోట్లాది విలువైన ప్రభుత్వ , ప్రయివేట్ ఆస్తుల దహనం ,విధ్వంసానికి గురయ్యాయి. ఇలా సవాలుగా మారిన ఉద్యమం దెబ్బకు... బలమైన కోటగా చెప్పుకున్న బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కదిలింది. పటేల్ కమ్యూనిటీ కదలికలను నియంత్రించడానికి, రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తన బలాన్ని,బలగాలను రంగంలోకి దింపాల్సివచ్చింది.
గో సంరక్షణపేరుతో దళితులపై దారుణాలెన్నో..
ఈ హింసాత్మక ఘర్షణ జరిగిన కొన్ని రోజులయ్యాక.. ఈ 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' గోసంరక్షణ పేరుతో దళిత సమాజంపైకి దాడుల్ని ఉసిగొల్పింది. బీజేపీ, అనుబంధ సంస్థలు బరితెగించాయి.మైనార్టీలపై విధ్వంసం సృష్టించాయి. కుల ఉద్రిక్తతలకు ఆజ్యంపోసింది.గుజరాత్లో శాంతి భద్రతలు చేజారటంతో... అక్కడి జనం దృష్టిమరల్చటానికి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌ను 2016 లో ఆగస్టు నెలలో తొలగించకతప్పలేదు.
తెరపైకి మరో సీఎం...
ఆనందిబెన్ స్థానంలో విజరు రూపానీని 'డబుల్ ఇంజిన్ కీ సర్కార్' ముఖ్యమంత్రిగా చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఎవరు..? అని పకటించలేదు. కానీ ఆ ఎన్నికల్లో అంతాతానేనన్నట్టుగా ప్రధాని మోడీ ఎన్నికల గోదాలోకి దిగారు. బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది.అప్పుడు కూడా..బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ వచ్చింది, కానీ అసెంబ్లీలో సీట్లు గణనీయంగా తగ్గడమే కాకుండా, బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కూడా భారీగా పడిపోయింది.
కీలుబొమ్మగా గుజరాత్ సీఎం...
2019 సార్వత్రికంలో గుజరాత్‌లోని అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగింది. అయితే విజరు రూపానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ..కీలుబొమ్మ సీఎంగానే అక్కడి ప్రజలు అనుకునేవారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని స్పష్టమైంది. చివరికి రూపానీ సర్కార్ తీరుపై హైకోర్టు చాలాసార్లు మందలించింది. రూపానీ పనితీరుపై పార్టీలో అసంతృప్తి, ఫ్యాక్షనిజం పెరిగింది. సామాజిక ఉద్రిక్తత పరిస్థితి మెరుగుపర్చలేకపోయారు. వివిధ వర్గాల నుంచి పార్టీ అగ్ర నాయకత్వం అందుకున్న ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విపరీతమైన అధికార వ్యతిరేక భావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గమనించింది. విజరురూపానీని తొలగించి,పటేల్ వర్గానికి చెందిన ఓట్లు తమవైపు పడేలా మోడీ ద్వయం భూపేంద్రపటేల్‌ను ముఖ్యమంత్రిగా చేశారు.
ఆట మొదలైంది...
మొత్తంగా... ఐదేండ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. మోడీ గుజరాత్ నుంచి ఢిల్లీకి వెళ్లాక.. బీజేపీ పట్టు బలహీనపడుత్నునది. అధికారపీఠానికి దూరమవుతున్న సంకేతాలతో ఢిల్లీలో ఉన్న హైకమాండ్‌కు నిద్రపట్టడంలేదు. గుజరాత్ ఒక్కటే కాదు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రిని మార్చే ప్రక్రియ అసోం నుంచి ప్రారంభమైంది. అక్కడ బీజేపీ తరఫున అప్పటి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ను చూపించి..గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది, కానీ ఎన్నికలయ్యాక. సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ నాయకత్వంపై పార్టీలో గొడవలు, తిరుగుబాట్లు తెరపైకి వచ్చాయి.. కుల, వర్గ సమతుల్యతను కాపాడటానికి అంటూ... గిరిజన వర్గానికి చెందిన సోనోవాల్‌ను కేంద్రంలో మంత్రిగా చేశారు. అసోం తర్వాత ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రిని మార్చే విషయంలో.. బీజేపీకి బొప్పికట్టింది. గుజరాత్లో జరిగిన అదే కథ ఉత్తరాఖండ్‌లో పునరావృతమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా... ముఖ్యమంత్రి ఎంపికలో ఎమ్మెల్యేల ఎంపికను దాటవేస్తూ, పార్టీ అగ్ర నాయకత్వం త్రివేంద్ర సింగ్ రావత్‌ని ముఖ్యమంత్రిగా చేసింది. అతను సీఎం అయిన వెంటనే, రావత్‌కు వ్యతిరేకంగా నిరసన స్వరాలు పార్టీలో గుప్పుమన్నాయి. కానీ పార్టీ నాయకత్వం మాత్రం లైట్ తీసుకున్నది. ఏడాది అయిందో లేదో. వచ్చిన నివేదికలతో అధిష్టానికి మైండ్ బ్లాక్ అయింది. ముఖ్యమంత్రిని మార్చకపోతే, ఏడాది తర్వాత.. జరిగే ఎన్నికల్లో పార్టీ ఓడిపోవచ్చని అగ్ర నాయకత్వం భావించింది. త్రివేంద్ర సింగ్ రావత్‌ను తొలగించారు. తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి అయ్యారు.
హరిద్వార్‌లో కుంభమేళా నుంచి కరోనా విధ్వంసంతో ఉత్తరాఖండ్ అస్తవ్యస్తమైంది. అయినా బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం రావత్ నిర్ణయాలను వెనకేసుకొస్తున్నది. తీరత్ సింగ్ రావత్ ఎమ్మెల్యేకాదు. పార్టీ సూచించిన నేత సీఎం అయ్యాడు. అయితే రాజ్యాంగ నిబంధన ప్రకారం పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా శాసనసభ సభ్యుడిగా ఎన్నికవ్వాలి. ఇప్పటికిప్పుడే రావత్‌ను తొలగించటం అసాధ్యంకావటంతో..అక్కడి ప్రతిపక్షపార్టీలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి.చివరకు రావత్‌ను గద్దెనుంచి దింపేశారు. ఇపుడు పరిపాలనలో అనుభవం లేని పుష్కర్ సింగ్ ధామిని ముఖ్యమంత్రి చేసింది.
దక్షిణభారతంలోనూ..
దక్షిణ భారతదేశంలో బీజేపీకి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. ఈ ప్రభుత్వం జనం వేసిన ఓట్లతో అధికారపీఠమెక్కలేదు. ఎమ్మెల్యేలను సంతంలో కొన్నట్టుగా కొన్నది. బీజేపీ అడ్డదారిలో బలాన్ని సంపాదించినా..ఆ ఘనత ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబడిన బిఎస్ యడ్యూరప్పకే దక్కుతున్నది. అత్యంత రాజకీయ ప్రభావవంతమైన లింగాయత్ సమాజం నుంచి ప్రాతినిధ్యం వహించటం.. బీజేపీతో ఉన్న అనుబంధం కూడా కలిసివచ్చింది. యడ్యూరప్ప వయస్సు 78 ఏండ్లు.. 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి.. అతని వయస్సు 80 దాటిపోతుంది. కాబట్టి పార్టీ అతనికి ప్రత్యామ్నాయం చూడకతప్పలేదంటూ ప్రచారం చేసింది.
లింగాయత్ సమాజంలోని అన్ని మఠాలతో సంబంధం ఉన్న వారంతా... చివరి నిమిషం వరకు యడియూరప్ప ను కొనసాగించాలని బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు, కాని చివరికి అతను కుర్చీని వదులుకోక తప్పలేదు. అయితే అతని వారసుడిని ఎన్నుకోవడం..ఎంపికకు ప్రాధాన్యతనిచ్చింది . బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిగా చేశారు. బొమ్మాయి కూడా లింగాయత్ కమ్యూనిటీకి చెందినవారే కావటంతో...ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని బీజేపీ భావిస్తున్నది. అయితే దీని ప్రభావం ప్రభుత్వ పనితీరుపై మాత్రమే కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీ 'డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఫార్ములా' గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్, కర్నాటకలో దెబ్బతిన్నది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం.. ఈ ఫార్ములా మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉల్లంఘించబడింది.బీజేపీ అగ్ర నాయకత్వానికీ ఈ విషయం తెలుసు.ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని మార్చడానికి అగ్రనేతలు ప్రయత్నించారు, కానీ హిందుత్వలో ఐకాన్ నంబర్ వన్ గా యోగి మారడంలో మోడీకి అస్సలు గిట్టడంలేదు. ఢిల్లీ పిలిచి రాజీ కుదిరించినా...యోగిని మాత్రం ఎన్నికలయ్యాక దాక సైలెంట్ గా ఉందామని అధిష్టానం భావిస్తున్నదని లీకులొస్తున్నాయి.
మాట వింటే సరే...
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొన సాగుతున్న రాష్ట్రా ల్లో ముఖ్యమంత్రిని మార్చే ప్రక్రియ ఇంకా ఆగలేదన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ,త్రిపుర నుంచి ప్రభుత్వాల పనితీరు గురించి ఢిల్లీకి వస్తున్న ఫీడ్‌బ్యాక్ పార్టీ నాయకత్వంలో మరింత ఆందోళనను పెంచుతున్నది. ఈ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులపై పార్టీలో అసంతృప్తి ఉన్నట్టు నివేదికలు వస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల సీఎంలను కూడా గతంలో ఢిల్లీకి పిలిచారు.అయితే ఇప్పుడే వేటు వేద్దామా..?లేక కొంతకాలం ఆగాక...విడతలవారీగా తొలగిద్దామా..అని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నదని సమాచారం.