Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'భారత్ బంద్' విజయవంతం చేసినందుకు ఏఐకేఎస్ అభినందనలు
న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చిన భారత్ బంద్‌ను చారిత్రాత్మకంగా విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) హృదయపూర్వక అభినందనలు తెలిపింది. దేశంలో కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఐక్య కూటమిగా ఉన్నారని పేర్కొంది. భారత్ బంద్‌ను విజయవంతం చేయడంలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనడాన్ని ఏఐకేఎస్ ప్రశంసించింది. ఈ మేరకు ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ''కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి వ్యవసాయం... మోడీ, షా అధికారం వదిలేయాలి'' అనే ప్రధాన నినాదంతో జరిగిన భారత్ బంద్ విజయవంతం అయిందని తెలిపారు.
ప్రజల ఐక్య పోరాటం
భారత్ బంద్ శాంతియుతంగా జరగడం శ్లాఘనీయమన్నారు. ఉద్యమం సామూహిక స్వభావాన్ని, దాని లక్ష్యాలను సాధించే వరకూ ఆందోళనలు కొనసాగించాలనే ప్రజల సంకల్పాన్ని ఈ భారత్ బంద్ స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు.
ఈ భారత్ బంద్ రాజకీయ దిశ ఏమిటంటే, గత కొన్నేండ్లుగా కార్మికులు, రైతులు ఐక్యత వర్గ స్వభావంతో ఉమ్మడి పోరాటాలు చేస్తున్నాయనీ, ఇప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల ఐక్య పోరాటం నిర్మించడానికి మార్గం సుగమం చేయడమేనని పేర్కొన్నారు. కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి విధానాలు అమలు చేసే రాజకీయ పార్టీలు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటాయనీ, ప్రజల ప్రతిఘటనతో ఈ ఉద్యమం బలోపేతమై వారిని గద్దెదించుతుందని స్పష్టం చేశారు.