Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్తాళ్లు.. అరెస్ట్‌లు
- మార్కెట్లు, మండీలు మూసివేత
- జాతీయ రహదారుల దిగ్బంధం
- రైల్‌రోకోలు... రాస్తారోకోలు
- పలుచోట్ల రైతు నేతల అరెస్టులు
- మోడీ, తోమర్ నియోజకవర్గాల్లో పూర్తి బంద్
- ముగ్గురు రైతులు మృతి
- బంద్‌కు విదేశాల్లోనూ సంఘీభావం
- దేశ ప్రజలకు ధన్యవాదాలు : ఏఐకేఎస్, ఎస్కేఎం
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే మోడీ సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతామని యావత్ భారత్ నినదించింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతమైంది. భారతావని పూర్తిగా స్తంభించింది. మార్కెట్లు, మండీలు, దుకాణాలు మూసివేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. పలు ప్రాంతాల్లో రైల్‌రోకోలతో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. రాస్తారోకోలతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. వివిధ రాష్ట్రాల్లో అరెస్టుల పరంపర కొనసాగింది. యూపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసిలో వేలాది మంది మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నియోజకవర్గం మొరెనాలో కూడా బంద్ విజయవంతంగా జరిగింది. భారత్ బంద్‌కు సంఘీభావంగా వివిధ దేశాల్లో ప్రవాస భారతీయులు ఆందోళనలు చేపట్టారు. భారత్ బంద్ విజయవంతం చేసినందుకు దేశ ప్రజలకు ఎస్కేఎం, ఏఐకేఎస్ ధన్యవాదాలు తెలిపాయి.
న్యూఢిల్లీ : దేశంలోని అన్నదాతల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పది నెలల పాటు శాంతియుతంగా పోరాటం చేపడుతున్న ఎస్కేఎం పిలుపు మేరకు భారత్ బంద్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దేశంలోని వివిధ వర్గాల ప్రజలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దేశంలోని 23కు పైగా రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాల్లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, చిన్నారులు భారీగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో వేలాది ప్రాంతాల్లో భారత్ బంద్ జరిగింది. అదేవిధంగా బంద్‌లో అనేక ఇతర సంఘాలు రైతులకు సంఘీభావంగా నిలిచాయి. కోట్లాది మంది ప్రజలు బంద్‌లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ముగ్గురు రైతులు మృతి చెందారు.
కేరళ, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. దక్షిణ అసోం, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో అనేక ఆందోళనలు జరిగాయి. రాజ స్థాన్, కర్నాటక రాజధాని నగరాలైన జైపూర్, బెంగళూరులో వేలాది మంది నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అసోం, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గుజరాత్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బంద్ విజయవంతమైంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, త్రిపురల్లోనూ బంద్ పూర్తిగా జరిగింది. పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో నిరసనకారులపై పోలీసులు దాడి చేశారు. వివిధ ప్రదేశాల్లో పెద్ద ప్రదర్శనలు, రైల్‌రోకో, రాస్తా రోకోలు జరిగాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఈ బంద్‌కు గతంలో కంటే ఎక్కువ స్పందన వచ్చింది. దాదాపు అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బంద్‌కు బేషరతుగా మద్దతునిచ్చాయి. రైతులు, కార్మికుల ఐక్యతను మరోసారి ప్రదర్శించాయి. ఈబంద్లో వివిధవ్యాపారులు, వర్తకు లు, ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్లు, విద్యార్థి, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, టాక్సీ, ఆటో యూనియన్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదుల సంఘాలు, పాత్రికేయ సంఘాలు, రచయితలు, కళాకారులతో పాటు ఇతర ప్రగతిశీల సంఘాలు దేశంలోని రైతులకు మద్దతునిచ్చాయి.
రైతు ఉద్యమానికి ప్రజల పూర్తి మద్దతు : రాకేశ్ టికాయత్
భారత్ బంద్ విజయవంతమైందనీ, తమ ఉద్యమానికి రైతులతో పాటు ప్రజానీకం నుంచి పూర్తి మద్దతు ఉందని రైతు నేత రాకేష్ టికాయిత్ అన్నారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామనీ, కానీ ప్రభుత్వం చర్చలు జరపడం లేదని విమర్శించారు. గత ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమ యంలో బీజేపీ మ్యానిఫెస్టోలో క్వింటా చెరకు ధర రూ.450కు పెంచుతా మని హామీ ఇచ్చారనీ, కానీ దాన్ని నెరవేర్చలేదని టికాయిత్ అన్నారు.