Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో చోటుచేసుకున్న అల్లర్లు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగాయని, హఠాత్తుగా జరిగినవి కావని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక నేరపూరిత ఆలోచన అల్లర్ల వెనుకుందని, శాంతిభద్రతల్ని దెబ్బతీయాలన్నదే దీనివెనుకున్న లక్ష్యమని న్యాయస్థానం పేర్కొంది. అల్లర్లలో హత్యకు గురైన ఒక హెడ్ కానిస్టేబుల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడి బెయిల్ పిటిషన్ విచారిస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు నిందితుల్లో ఒకరికి న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ బెయిల్ మంజూరుచేసి, మిగతావారికి నిరాకరించారు.పౌరసత్వ సరవణ చట్టానికి వ్యతిరేకంగా గత ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు సీఏఏ చట్టానికి మద్దతుగా మరికొంత మంది రోడ్ల మీదకు రావటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇనుప రాడ్లు, బేస్బాల్ బ్యాట్లు, కర్రలు పట్టుకొని కొంతమంది తీవ్రమైన దాడులకు తెగబడ్డారని ఎఫ్ఐఆర్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. నిరసనకారులను లక్ష్యంగా చేసుకొని ఒక గుంపు విచక్షణారహితంగా దాడికి తెగబడింది. హింసాత్మక ఘటనలు వరుసగా జరగటంతో పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధిక సంఖ్యలో ముస్లింలున్నారని సమాచారం. సంఘ వ్యతిరేక శక్తులు వీధుల్లో చెలరేగిపోయారని, సీసీటీవీ కెమెరాలను, రూటర్లను ధ్వంసం చేశారని, ముందస్తు ప్రణాళికతో జరిగిందనడానికి అనేక ఆధారాలున్నాయని న్యాయమూర్తి ప్రసాద్ వ్యాఖ్యానించారు.