Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారకులపై చర్యలు తీసుకోవాలని
- ప్రతిపక్షాలు, హక్కుల కార్యకర్తలు డిమాండ్
భువనేశ్వర్ : ఒడిశాలో చోటుచేసుకున్న పోలీస్ కస్టడీ మరణంపై వివాదం ముదురుతోంది. బార్గర్ టౌన్ పోలీసుస్టేషన్ అధికారులు 35 ఏండ్ల గోవిందా కుంబార్ అనే ఒక దళిత యువకుడిని తీవ్రంగా హింసించడంతోనే అతను మరణించాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులను తక్షణం తొలగించాలని, అదేవిధంగా కస్టడీ డెత్‌పై పారదర్శకంగా విచారణ చేయాలని పలు ప్రతిపక్ష పార్టీలతో పాటు హక్కుల సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. బార్గర్ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని టోరా గ్రామానికి చెందిన గోవిందా కుంబార్‌ను పోలీసులు ఈనెల 24 రాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్లో కుంబార్కు సీరియస్ కావడంతో బార్గర్ జిల్లా హెడ్‌క్వార్టర్ ఆసుపత్రి (డిహెచ్‌హెచ్)కి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం (25వ తేదీ) ఆస్పత్రిలో మరణించాడని వైద్యులు వెల్లడించారు. కాగా, కస్టడీలో పోలీసులు తీవ్రంగా హింసించడంతోనే తన భర్త మరణించాడనీ, అంతకుముందు ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదని గోవిందా కుంబార్ భార్య రూబీ పేర్కొన్నారు.
కస్టడీ మరణం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తించింది. గోవిందా మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ కార్యాలయానికి ర్యాలీ చేపట్టిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీని అనంతరం ఇద్దరు ఎస్ఐలతో పాటు ఐదుగురిని రిలీవ్ చేశారు. అయితే అధికారులను రిలీవ్ చేయడం కాదని, ఉద్యోగం నుంచి వారికి తక్షణం తొలగించాలని రాష్ట్రీయ దళిత్ మహాసభ అధ్యక్షులు అశోక్ మల్లిక్ డిమాండ్ చేశారు. కస్టడీ డెత్‌పై కాలపరిమితితో విచారణ చేయాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతుకుముందు గోవిందా మరణానికి దారితీసిన పరిస్థితులు, అతని శరీరంపై గాయాల స్పష్టమైన సంకేతాలు నేరపూరిత దాడిని సూచిస్తున్నాయని, తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బర్గార్ ఎంపీ సురేష్ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోలీసుల చర్యలు మంచి సంకేతం కాదని ఆయన పేర్కొన్నారు.