Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాసెసింగ్, రిటైల్‌లోకి ప్రభుత్వం
- మత్య్స శాఖ సమీక్షలో ఏపీ సిఎం
అమరావతి : చేపలు, రొయ్యల ఎగుమతుల ప్రక్రియలో సిండికేట్ల జోక్యాన్ని అడ్డుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మత్స్యశాఖతో పాటు జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయానికి దళారులు సిండికేట్లయి రేట్లు తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారని అన్నారు. దీనిని అడ్డుకునేందుకు ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్ రంగాల్లోకి ప్రభుత్వమే అడుగుపెడుతుందని చెప్పారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా, స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్ వ్యవస్థలను తీసుకురానున్నట్లు తెలిపారు. ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని, రైతులను ఆ దిశగా ప్రోత్సహించా లన్నారు. ఆక్వాహబ్‌లు, రిటైల్ దుకాణాల ద్వారా దాదాపు 40 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. జనవరి 26 నాటికి దాదాపు 75 నుండి 80 హబ్‌లు, 14 వేల రిటైల్ అవుట్లెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 10 ప్రాసెసింగ్ ప్లాంట్లు, 23 ప్రి ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని, వచ్చే ఏడాది జూన్, జులై నాటికి ఈ నాలుగు హార్బర్లు ప్రారంభానికి సిద్దమౌతాయని అధికారులు సిఎంకు తెలిపారు. అమూల్ పాలవెల్లువపై నిర్వహించిన సమీక్షలో అమూల్ రాష్ట్రంలోకి వచ్చాక లీటరుకు రూ.5 నుండి రూ.15వరకు రైతులకు అదనపు ఆదాయం లభిస్తోం దన్నారు. సమీక్షలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు, అధికారులు పూనం మాలకొండయ్య, కరికాల వలవెన్, కె మురళీధరన్, ఎ బాబు, కె కన్నబాబు, కెవివి సత్యనారాయణ, అమరేంద్ర కుమార్, అమూల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.