Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 30న ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదల
- వైసిపి అభ్యర్థిగా దాసరి సుధ
- టిడిపి తరపున రాజశేఖర్
- పోటీపై పునరాలోచించండి : సజ్జల
న్యూఢిల్లీ : బద్వేలు శాసనసభ నియోజకవర్గ పోరుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 30వ తేదిన ఉప ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. ఉప ఎన్నికకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ చివరిరోజు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నియోజకవర్గం నుండి తమ అభ్యర్థిగా వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధ ను వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఓబుళాపురం రాజశేఖర్‌ను ఎన్నికల బరిలో నిలపుతున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ విడుదలైన అనంతరం తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పోటీ విషయంలో పునరాలోచించాలని టీడీపీని కోరారు. చనిపోయిన వ్యక్తి కుటుంబంలోని వారికి టిక్కెట్టు ఇస్తున్నప్పుడు పోటీ పెట్టకుండా ఉండటమన్నది సాంప్రదాయంగా వస్తోందని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికకు దీనికి పోటీ లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. నంద్యాల ఎన్నికలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జనరల్ ఎన్నికలుగా భావించి 100 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. తెలుగుదేశంపార్టీ పోటీ పెట్టినా గత రెండు సంవత్సరాలుగా చేసింది చెప్పుకోవడానికి, ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కన్నా భారీ మెజార్టీ సాధించడం ఖాయమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.