Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ పీసీసీ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే, ఆ రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారని వార్తలు వెలువడ్డాయి. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జె.పి.నడ్డాలను కలుసుకుంటున్నారని సమాచారం. దీనికంటే ముందు పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేస్తున్నట్టు అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం అజెండాలో మాత్రం రాజీపడే ప్రసక్తేలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ లేఖను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పీసీసీ పదవి చేపట్టిన రెండు న్నర నెలలకే రాజీనామా చేయడం గమనార్హం. పంజాబ్ మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీ నామా చేసినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. సిద్ధూకు పీసీసీ పదవిని కట్టబెట్టడంపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తొలినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే. దేశానికి, పంజాబ్‌కు సిద్ధూ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సిద్ధూ రాజీనామాకు కొద్దిసేపు ముందు అమరీందర్ సింగ్ ఢిల్లీకి వెళ్లటం వార్తల్లో నిలిచింది. మంగళవారం ఆయన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జె.పి.నడ్డాలను కలిశారు. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరతారని ఊహాగానాలు చెలరేగుతున్నవేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. గతకొన్ని నెలలుగా సిద్ధూ, అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో, రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్ర సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమించిన కాంగ్రెస్ అధిష్టానం...ఆ తర్వాత సీఎంగా చరణ్‌జిత్ సింగ్ కొత్త సీఎంగా నియమించటం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏదేమైనా పంజాబ్ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోవటం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది.
సిద్ధూ రాజీనామాపై అమరీందర్ ట్వీట్!
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిద్ధూ రాజీనామాపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్ధూకి స్థిరత్వంలేదని ముందే చెప్పానుగా...అని పేర్కొన్నారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్ధూ సరికాదన్నారు.