Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికీ అమ్మకాలు లేక విలవిల
- కరోనా, రుణ లభ్యత సమస్యలు
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు అన్ని రంగాల్లో వేలాది సూక్ష్మ, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) వ్యాపారాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, బ్యూటీ సెలూన్లు, కిరాణా స్టోర్లు, సరుకు రవాణ సంస్థలు, తయారీదారులు తదితర రంగాల వేలాది సంస్థలు అమ్మకానికి వస్తున్నాయని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. కరోనా సంక్షోభానికి తోడు రుణ లభ్యత సమస్యలు, పోటీతత్వం, వినియోగదారుల కొరత తదితర అంశాలు అనేక మంది ఉపాధిని దెబ్బతీసింది.
'రెండో లాక్డౌన్ ద్వారా క్రమంగా వినియోగదారులు తగ్గారు. ఆర్థికంగా చాలా సమస్యలు నెలకొన్నాయి. ప్రస్తుతం మేము రూ.25 లక్షల నష్టాల్లో ఉన్నాము. ఖాతాదారుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో అమ్మకాలు పడిపోయాయి.'' అని హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్ యాజమాని ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నరు కేంద్రంగా పని చేస్తోన్న ఓ గాలి శుద్ది తయారీ యంత్రాల సంస్థ కూడా తమ వ్యాపారాన్ని విక్రయించనున్నట్టు ప్రకటించింది. కరోనాతో భౌతిక అమ్మకాలు పడిపోయాయని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్కూల్ యాజమాని కూడా తమ సంస్థను అమ్మకానికి పెట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించడానికి నిరాకరిస్తున్నారన్నారు. దీంతో సంస్థ నడవడం లేదన్నారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోని ఓ అడ్వెంచర్ పార్క్ యాజమానికి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఇల కొనుగోలు, అమ్మకాలను డాటా సేకరించే ఎస్ఎంఇఆర్జీఈఆర్ఎస్ రిపోర్ట్ ప్రకారం.. 2020 ఏప్రిల్ 1 నాటికి 1.65 లక్షల చిన్న వ్యాపార సంస్థలు అమ్మకానికి రాగా.. ఇందులో కేవలం 52వేలు మాత్రమే ఫలించాయి. కరోనా తొలి దశ కాలంలో రోజుకు 10 యూనిట్లు అమ్మకానికి వస్తే.. రెండో వేవ్ తర్వాత ఇది రెట్టింపై 20కి చేరింది. ప్రస్తుతం ఇది 25పైనే ఉంది. వచ్చే ఆరు మాసాల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఆ సంస్థ హెడ్ దేవ్నాత్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వేదికపై 5వేల వ్యాపారాలు అమ్మకానికి లిస్టింగ్ అయి ఉన్నాయన్నారు. వీటి అమ్మకానికి కారణాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికీ గార్మెంట్స్, పాదరక్షలు, అభరణాలు, బ్యూటీ, పర్సనల్ కేర్ రంగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈఓ కుమార్ రాజగోపాలన్ పేర్కొన్నారు. కాగా ఎలక్ట్రానిక్స్, అహారోత్పత్తులు, క్విక్ సర్వీసు రెస్టారెంట్లు బాగానే పని చేస్తున్నాయన్నారు. కన్సూమర్ డ్యూరెబుల్స్ రంగం అమ్మకాలు పర్వాలేదన్నారు. ఒకవేళ మూడో వేవ్ రాకపోతే అక్టోబర్ కల్లా ఆయా రంగాలు 12 శాతం పుంజుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పుడిప్పుడే వినియోగదారులు బయటికి షాపింగ్‌కు వస్తున్నారన్నారు. 2021 ఆగస్టులో రిటైల్ అమ్మకాలు కోవిడ్ ముందు నాటితో పోల్చితే 88 శాతానికి చేరాయని ఇటీవల ఆర్‌ఎఐ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. 2019 ఆగస్టుతో పోల్చితే గడిచిన మాసంలో అమ్మకాలు 12 శాతం పెరుగుదల చోటు చేసుకున్నట్టు అంచనా వేసింది.