Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ వెల్లడి
న్యూఢిల్లీ : రైల్వే ఆస్తుల విక్రయాన్ని మోడీ ప్రభుత్వం వేగవంతం చేసింది. నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైపులైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా రూ.17,810 కోట్ల విలువ చేసే రైల్వే ఆస్తులను అమ్మకానికి పెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లను ప్రయివేటీకరిస్తోంది. అమ్మకానికి 12 స్టేషన్లను ప్రతిపాదించగా అందులో 5 స్టేషన్ల విక్రయ కసరత్తు తుది దశలో ఉందని క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబ తెలిపారు. దీనిపై ఇటీవల రెండు రోజుల పాటు సమీక్ష జరిగిందన్నారు. తొలుత మూడు స్టేషన్లను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య పద్దతిలో నిర్వహించడానికి ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ ఇతర స్టేషన్లకు సంబంధించి వివిధ దశల్లో ఉందన్నారు. సెప్టెంబర్ 30 నాటికి లావాదేవీల అడ్వైజర్ నియామక సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి కానుందని సెక్రటరీస్ గ్రూపునకు రైల్వే బోర్డు చైర్మెన్, సీఈఓ సమాచారం ఇచ్చారు. లావాదేవీల అడ్వైజర్ నియామకం ప్రక్రియపై కసరత్తు జరుగుతుందన్నారు. రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌కు సంబంధించి నవంబర్ కల్లా ఓ స్పష్టత రానుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన రూ.6 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు విక్రయించాలని మోడీ సర్కార్ మానిటైజేషన్ ప్లాన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే నాలుగేండ్లలో ఈ ఆస్తులను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో రోడ్లు, రైల్వే, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ పైపులైన్లు, టెలికం సంస్థల ఆస్తులు ఉన్నాయి. వీటిలో రోడ్లు, రైల్వేలకు సంబంధించిన ఆస్తుల విలువనే 52 శాతంగా ఉన్నది.