Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలకు రూ.లక్ష కోట్లు అప్పు చేస్తున్న మోడీ సర్కార్
- రాబోయే ఆరు నెలలకు 5లక్షల కోట్ల కేంద్ర రుణ ప్రణాళిక
- ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పు
- బడ్జెట్లో 35 శాతం రుణాలే
- రూ.120 లక్షల కోట్ల అప్పు
దేశం ప్రస్తుత అప్పు రూ.120 కోట్లు ఉంది. 2021-22 బడ్జెల్ లెక్కల ప్రకారం దేశం ప్రస్తుత రూ.1,20,91,193 కోట్లు ఉంది. అందులో దేశీయ అప్పు రూ.1,04,03,954 కోట్లు కాగా, విదేశీ అప్పు రూ.6,72,101 కోట్లుగా ఉంది. ప్రభుత్వ పద్దు అప్పు రూ.10,15,108 కోట్లుగా ఉంది.
దేశ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్రోల్, డీజిల్పై, నిత్యావసర సరుకులపై పెద్ద మొత్తంలో పన్నులు వేస్తూ కేంద్రం వసూలుచేస్తున్న లక్షల కోట్ల ఆదాయం ఎటుపోతోందో తెలియటం లేదు. మరోవైపు కేంద్రం నెలకు రూ.లక్ష కోట్లు అప్పులు చేస్తోంది. ప్రజల నుంచి వస్తున్న పన్ను ఆదాయం, అప్పులతో సేకరించిన లక్షల కోట్లు..ఎవరి పాలవుతుందో? అర్థం కావటం లేదు. మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు దేశాన్ని కొంపముంచేట్టు చేస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా సమాచారం నిపుణుల అనుమానాల్ని నిజం చేస్తోంది.
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్ భారీగా అప్పులు చేసేందుకు సిద్ధమైంది. నెలకు రూ.లక్ష కోట్లు చొప్పున, ఆరు నెలల్లో సుమారు రూ.ఆరు లక్షల కోట్లు అప్పులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు నెలల్లో రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసింది. దేశం ప్రస్తుతం రూ.120 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సంప్రదించి అప్పులపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం (ఆరు నెలలు)లో రూ.5.03 లక్షల కోట్లు అప్పులు తీసుకోవడానికి సిద్ధమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.12.05 లక్షల కోట్ల రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో తొలి ఆరు నెలల్లో (మొదటి అర్థభాగం) రూ.7.24 లక్షల కోట్లు (60 శాతం) అప్పులు చేయాలని నిర్ణయించింది. అయితే రూ.7.02 లక్షల కోట్లు అప్పు చేసింది. మిగిలిన రూ.5.03 లక్షల కోట్ల అప్పును వచ్చే ఆరు నెలల్లో చేయాలని యోచిస్తోంది. 21 వారాల్లో వారానికి రూ.23, 24 వేల కోట్ల చొప్పున తీసుకోవాలని భావిస్తోంది. అందులో 20 వారాల్లో రూ.24 వేల కోట్లు చొప్పున, చివరి వారంలో రూ.23 కోట్లు అప్పుగా తీసుకోనున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పరిహారానికి బదులుగా బ్యాక్-టు-బ్యాక్ రుణ సదుపాయం కారణంగా రాష్ట్రాలకు బ్యాలెన్స్ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మొదటి ఆరు నెలల్లో తీసుకున్న అప్పులకు సగటున 6.19 శాతం వడ్డీ అయింది. ఇందు కోసం 2 (4 శాతం), 5 (11.9 శాతం), 10 (28.4 శాతం), 14 (17.9 శాతం), 30 (13.9 శాతం), 40 (15.1 శాతం) ఏళ్ల కాల పరిమితితో బాండ్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది.