Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : గుజరాత్ దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు 2వ తేదీ వరకు అరేబియా సముద్రంలోకి ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు బుధవారం సాయంత్రానికల్లా ఒడ్డుకు తిరిగి రావాలని సూచించింది. గులాబ్ తుపాను ప్రభావం కారణంగా ఈ అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తన బులెటిన్‌లో పేర్కొంది. దక్షిణ గుజరాత్‌లోని పలు ప్రాంతాలతో పాటు సౌరాష్ట్ర రీజియన్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లో ఇప్పటి వరకు వార్షిక సగటు వర్షపాతంలో 90 శాతం నమోదైందని రాష్ట్ర ప్రత్యేక అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్ఈఓసీ) తెలిపింది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 24 గంటల వ్యవధిలో సూరత్‌లోని ఉమర్పాడా తాలూకాలో 218, పల్సానాలో 192 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.