Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌కు తాలిబన్ల లేఖ
న్యూఢిల్లీ : భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలిసారిగా అధికారిక సంప్రదింపులు జరిగాయి. రెండు దేశాల మధ్య కమిర్షియల్ వైమానిక సేవలను పునరుద్ధరించాలని కోరుతూ తాలిబన్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు లేఖ రాశారు. భారత్‌కు విమాన సేవలను పునరుద్ధరించేందుకు ఆఫ్ఘన్ విమాన సంస్థలకు అనుమతి ఇవ్వాలని కోరిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ లేఖ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నుంచి ఈనెల 7వ తేదీనే డీజీసీఏకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పౌరవిమానయాన శాఖ మంత్రి అల్హజ్ హమీదుల్లా సంతకంతో ఉన్న ఈ లేఖలో ''అమెరికా దళాలు వెనక్కి వెళ్లే క్రమంలో కాబూల్ ఎయిర్‌పోర్టు ధ్వంసమైంది. దీంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కతార్ సాంకేతిక సాయంతో విమానాశ్రయాన్ని పునరుద్ధరించగలిగాం. భారత్, ఆఫ్ఘన్ మధ్య ప్రయాణికుల రాకపోకలు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. కమర్షియల్ విమానాల సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నాం'' అని ఉంది. కాగా, తాలిబన్ల అభ్యర్థనపై భారత పౌరవిమానయాన శాఖ సమీక్ష చేస్తోందని అధికారి ఒకరు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆగస్టు 15న ఆఫ్గాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత నుంచి ఆ దేశానికి కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.