Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత
- పరిహారం వెంటనే చెల్లించాలి
- ఎన్హెచ్ఆర్సీ సిఫారసులు
న్యూఢిల్లీ : మాన్యువల్ స్కావెంజర్ల (కర్మచారి) రక్షణ చూడాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ ఆర్సీ) సిఫారసు చేసింది. దేశంలో ఈ వ్యవస్థను నిషేధిం చినా ఇంకా కొనసాగడంపై.. అసంతృప్తి వ్యక్తంచేసింది. మాన్యువల్ స్కావెంజర్ల మరణాలపై సంబంధిత అథారి టీలదే బాధ్యత అని పేర్కొంది. మాన్యువల్ స్కావెంజర్ల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఈ మేరకు బుధవారం సిఫారసులు చేసింది. ఈ సిఫారసులపై తీసుకొన్న చర్యలపై మూడు నెలల్లో నివేదిక అందించాలని పేర్కొంది. 'మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. వారి పిల్లలకు ఉపకారవేతనాలతో కూడిన విద్య అందించాలి. వారి డేటాబేస్ ఏర్పాటు చేయాలి. సెప్టిక్ ట్యాంకులు, కాలువలు శుభ్రం చేసే వారికి హెల్మెట్లు, రక్షణ జాకెట్లు, గ్లౌజులు, బూట్లు, రక్షణ కళ్లజోళ్లు, ఆక్సిజన్ సిలెండర్లతో కూడిన టార్చిలైట్లు.. స్థానిక సంస్థలు లేదా నియమిత సంస్థలు అందజేయాలి. సాంకేతికతలో వస్తున్న మార్పులు గమనిస్తూ కేంద్ర, పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ ఆయా పరికరాలు కొనుగోలు చేయాలి. ప్రమాదకర రసాయనాల శుద్ధికి నిపుణులైన కార్మికులను వినియోగించాలి. వారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయాలి. మురుగు కాలువలు యంత్రాలతో శుభ్రం చేసేలా నిర్మించాలి. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బయో టాయిలెట్లు నిర్మించాలి. మాన్యువల్ స్కావెంజర్లు ప్రమాదవశాత్తూ మృతి చెందితే స్థానిక సంస్థలు, నియమిత సంస్థలే బాధ్యత వహించాలి. పరిహారం మొత్తం ఒకేసారి చెల్లించాలి'' అని సిఫారసు చేసింది.