Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వైరస్ ఆధీనంలో మనం ఉన్నాం అని కానీ, వైరస్ మన ఆధీనంలో ఉంది అని కానీ భావించవద్దని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగేసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖత్రేపాల్ సింగ్ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. కానీ, ప్రజలపై టీకాల ప్రభావం, రోగనిరోధక శక్తి పెరగడం కారణంగా వైరస్ ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న వారిలో యాంటీ బాడీలు ఉత్పన్నమై.. వైరస్ బారిన పడే తీవ్రత తక్కువగా ఉంటుందని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే వార్తలపై పూనమ్ ఖత్రేపాల్ సింగ్ స్పందించారు. అది ఎంత తీవ్రంగా ఉంటుందనేది మనందరి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగితే వైరస్ ఎక్కువ మందికి సోకే అవకాశం లేదని తెలిపారు. వ్యాధి త్వరలోనే అంతమవుతుందా? సుదీర్ఘ కాలం కొనసాగుతుందా? అనే విషయం పలు రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ మనతోనే సుదీర్ఘ కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే టీకాలు, రోగనిరోధక శక్తి కారణంగా కరోనా ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యాధి నిర్మూలన అసంభవం అయినప్పుడు దాన్ని నివారించేందుకు కషి చేయాలన్నారు. దీని ద్వారా ఆసుపత్రిలో చేరడం, మరణాలను అరికట్టవచ్చని.. సామాజిక, ఆర్థిక, ఆరోగ్య నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు. బూస్టర్ డోస్‌పై పూనమ్ ఖత్రేపాల్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధనిక దేశాలు బూస్టర్ డోసు అందించడం వల్ల ఇంకా తొలి డోసు అందని దేశాలకు సరఫరా ఆలస్యమవుతుందని అన్నారు. 'బూస్టర్ డోసు వినియోగంపై డబ్ల్యూహెచ్ఓలో ఈ ఏడాది చివరి వరకు మారటోరియం విధించింది. బూస్టర్ డోసును నిలిపివేస్తే అన్ని దేశాల్లోని కనీసం 40 శాతం మందికి టీకాలు అందుతాయి. ప్రమాద పరిస్థితుల్లో ఉన్నవారు సహా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి. అందరూ సురక్షితంగా ఉండే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి' అని అన్నారు. మూడవ డోసు.. బూస్టర్ డోసు అందరికీ అవసరం ఉండకపోవచ్చని కూడా తెలిపారు.