Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 గంటల పనికి డిమాండ్
- ఇప్పటికే 12 గంటలకు పైగా పనిభారంతో గ్రామ ఆరోగ్య నర్సులు
చెన్నై: తమిళనాడు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో విలేజ్ హెల్త్ నర్సులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే, వీరు ప్రస్తుతం ఆందోళనకు దిగారు. ఆరోగ్య సేవలను, కరోనా టీకా కార్యక్రమాలను ప్రభావితం చేయకుండా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. విలేజ్ హెల్త్ నర్సుల సంఘం 42 అంశాతలో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఇందులో ముఖ్యంగా పని సమయం గురించి వెల్లడించారు. ఇప్పటికే విలేజ్ హెల్త్ నర్సులు రోజుకు 12 నుంచి 14 గంటల వరకు పనిచేస్తున్నారనీ, ఈ పనిభారాన్ని తగ్గించాలన్నారు. అందరిలాగా తమకు కూడా 8 గంటలు పనిచేసే విధంగా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న విలేజ్ హెల్త్ నర్సు పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో తమ సేవలు కీలకమైనవనీ, పాలిచ్చే తల్లులు, పిల్లలు, రోగ నిరోధక, ప్రసూతి కార్యక్రమాలు ప్రభావితం కాకుండా తమకు కరోనా టీకా విధులు షెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సెలవు దినాలను తమకు కూడా వర్తింపజేయాలన్నారు. ఇలాంటి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రజా ఆరోగ్య డైరెక్టర్ (డీపీహెచ్)కు అందజేశారు. ఈ నెల ప్రారంభంలోనూ విలేజ్ హెల్త్ నర్సుల సంఘం ఇలాంటి ఆందోళనలు చేసింది. ఇలాంటి డిమాండ్లతోనే నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసను తెలియజేశారు. విలేజ్ నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసువచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా మళ్లీ విలేజ్ హెల్త్ నర్సులు నిరసనలకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు వారితో చర్చలు జరిపారు. సెలవు దినాలలో విధుల నుంచి మినహాయింపు డిమాండ్‌ను పరిశీలిస్తామని, సాధారణ పనివేళలు సైతం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కాగా, రాష్ట్ర ప్రజారోగ్యం డైరెక్టరేట్ కింద ప్రాథమికా ఆరోగ్య కేంద్రాల్లో 10 వేల మందికి పైగా విలేజ్ హెల్త్ నర్సులు, 1400 మందికి పైగా సెక్టార్ హెల్త్ నర్సులు, 384 మంది కమ్యూనిటీ హెల్త్ నర్సులు పనిచేస్తున్నారని సంబంధిత యూనియన్ వెల్లడించింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అసోసియేషన్ తెలిపింది.