Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరావాసం, పరిహారం హామీపై జోక్యం చేసుకోండి
- గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు
- 80 శాతం ప్రాజెక్టు పూర్తి అయినా, పునరావాసం అంతంతే.. :
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండాకు సీపీఐ(ఎం)బృందం వినతి
న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాను సీపీఐ(ఎం) నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం నాడిక్కడ కేంద్ర మంత్రి కార్యాలయంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి రాఘవులు నేతృత్వంలోని బృందం కలిసి, పోలవరం నిర్వాసితుల సమస్యలపై మూడు పేజీల వినతి పత్రం అందజేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కుటుంబాలు నిర్వాసితులయ్యాయనీ, అందులో ఎక్కువ మంది గిరిజనులని పేర్కొన్నారు. వారి ప్రధాన జీవనోపాధి అటవీ, సాగు భూమి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ప్రకారం పోలవరం ప్రాజెక్టు మొత్తం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేననీ, కాకపోతే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అంతమాత్రాన కేంద్ర ప్రభుత్వం తన ప్రాథమిక బాధ్యత నుంచి తప్పుకోవడానికి వీలులేదని అన్నారు. సీపీఐ(ఎం) మాజీ ఎంపీలు బృందా కరత్, పి.మధు ముంపు ప్రాంతాల్లో ఇటీవలే పర్యటించి, ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలను కలుసుకున్నారని తెలిపారు. వారి పరిస్థితి కడుదయనీయంగా ఉందని తాము గుర్తించామనీ, మనుగుడ కోల్పోయే స్థితిలో ఉన్న లక్షలాది మంది గిరిజనలను ఆదుకోవాలని కోరుతున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రాజెక్టు కాపర్ డ్యామ్ నిర్మాణంతో ఇప్పటికే అనేక గ్రామాలు మునిగిపోయాయనీ, వేలాది మంది మంది గిరిజనలు, ఇతర పేదలు నిరాశ్రయులయ్యారని తెలిపారు.
ప్రాజెక్టు 80 శాతం పూర్తయినా..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 80 శాతం పూర్తయినా నాలుగు శాతం నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదని పేర్కొన్నారు. ఇది గిరిజనులకు పూర్తిగా అన్యాయం చేయడమేనని, కాబట్టీ కనీసం పునరావాసానికి ప్రాధన్యత ఇవ్వాలని కోరారు. నిర్వాసితులైన ప్రతి కుటుంబానికి పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పేద గిరిజనలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎనిమిది మండలాల్లోని 356 గ్రామాల్లో పోలవరం నిర్మాణంతో 1,05,601 కుటుంబాలు నిర్వాసితులవుతుంటే ఇప్పటి వరకు కేవలం నాలుగు వేల కుటుంబాలకే పునరావాసం కల్పించారని తెలిపారు. ఇది మొత్తం ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల్లో (పిఎఎఫ్) కేవలం నాలుగు శాతం మాత్రమేనని వివరించారు. పునరావాసం, పరిహారం కోసం కేవలం రూ.6,371 కోట్లు మాత్రమే కేటాయించారని, రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన ప్రకారం ఇంకా రూ.26,796 కోట్లు అవసరమని తెలిపారు. తక్షణమే 18,620 కుటుంబాలకు పునరావాసం కల్పించకపోతే వరదలతో తీవ్ర ముప్పు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 1986లో వచ్చిన గోదావరి వరదలను ఆధారంగా చేసుకొని ముంపు బారిన పడే కుటుంబాలను గుర్తించాలని కేంద్ర మంత్రికి సూచించారు.
అటవీ హక్కుల చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలి
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లించాలని, ప్రతి ఎకరాకు రూ.20 లక్షలు, ఆర్.ఆర్. ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి రూ. 10.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని కోరారు. పోలవరం నిర్వాసితుల్లో అత్యధికులు గిరిజనులేనని, ముంపుతో అటవీ, సాగు భూములపై ఆధారపడిన వారి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు. వివిధ సాకులు చూపుతూ పలు గ్రామాలను ముంపు పరిధిలో చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని పెద్దగూడెం, కేతనపల్లి, తాలూరు, కొక్కెరగూడెం, కొండమొదలుల్లోని పాఠశాలలు గతేడాది ఆగస్టు నుంచి ముంపులోనే ఉన్నాయని, వరద వచ్చినప్పుడల్లా చింతూరు, కూనవరం, విఆర్ పురం, ఎటపాక మండాల్లో వందల పాఠశాలలు మునిగిపోతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. విఆర్ పురం మండలంలోని రేఖపల్లి, రాజుపేట, వడ్డెగూడెం ప్రాజెక్టు ముంపు బారిన పడుతున్నప్పటికీ వివిధ సాకులు చూపుతూ ముంపు జాబితాలో చేర్చటం లేదని, దీన్ని సరిచేయాలని కోరారు. విఆర్ పురం మండలంలోని కోటారిగొమ్ము తదితర గ్రామాలు ముంపులో ఉన్నప్పటికీ ఆయా గ్రామాల భూములు మునగడం లేదంటూ పరిహారం జాబితాలో చేర్చలేదని ఫిర్యాదు చేశారు. ఒకసారి పునరావాసం పొందిన వారు ఆయా భూములను సాగు చేయలేరనే విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోడం లేదని, ఆ భూములకు పరిహారం చెల్లించాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సిపిఎం నేతలు ఎం.నాగేశ్వరరావు, పి.సంతోష్ కుమార్, సి. హెచ్. దుర్గాప్రసాద్ ఉన్నారు.
నిర్వాసిలుకు పునరావాసం కల్పనకు చర్యలు తీసుకుంటాం: కేంద్ర మంత్రి హామీ
తక్షణమే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు సిపిఎం నేతలు తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో చర్చించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని, ఎస్టి కమిషన్ను మరలా నిర్వాసిత గ్రామాల్లో పర్యటనకు పంపిస్తామని, నిర్వాసితుల సమస్యలను అధ్యయనం చేయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 80 శాతం నిర్వాసితుల కుటుంబాలల్లో కేవలం 4 శాతం కుటుంబాలకు మాత్రమే ఆర్ అండ్ ఆర్, పునరావవాసం కల్పించటం అన్యాయమని, దీనిపై విచారణ చేయిస్తామని అన్నారని పేర్కొన్నారు. ముంపులో చేర్చని గ్రామాలైన విఆర్ పురం మండలంలోని రేఖపల్లి, బిసి కాలనీ, రాజుపేట, చిన్నమట్టపల్లి,సున్నంవారి గూడెంలను ముంపులో చేర్చుటకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.