Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసంఘటిత, వలస కార్మికులకు ఆహార భద్రత కరువు
- రేషన్ కార్డుల్లేని వారికి ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాలు బుట్టదాఖలు
- ప్రస్తుత జనాభా ప్రకారం 'ఆహార భద్రతా చట్టం' అమలు చేయాలన్న సుప్రీం
- అయినా..2011 జనాభా ప్రకారమే రాష్ట్రాలకు రేషన్ కోటా విడుదల
- ఎన్నిమార్లు చెప్పినా.. పట్టించుకోని మోడీ సర్కార్
ఎప్పుడో 2011 జనాభా ప్రాతిపదికన ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పుడూ ఉన్నాయి. ఇదేం పద్ధతి. దీనిని కాలానుగుణంగా 'రివైజ్' చేసుకోరా? ఈ దేశంలో అసంఘటిత, వలస కార్మికుల్లో కోట్లాది మంది రేషన్ కార్డులు లేక ఆహార భద్రతకు దూరమవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులవుతున్నారు. కరోనా మొదటివేవ్ సమయంలో వలస కార్మికులు ఎలా రోడ్డునపడ్డారో అందరం చూశాం. ఇకనైనా మేల్కోవాలి...అంటూ సుప్రీంకోర్టు అనేకమార్లు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల కష్టాల్ని తీర్చాలంటూ మార్గదర్శకాలు జారీచేసింది. అయితే మోడీ సర్కార్లో మాత్రం కదలిక లేదు. మళ్లీ 2011 జనాభా ప్రకారమే రేషన్ కోటా రాష్ట్రాలకు విడుదలైందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. సుప్రీం మార్గదర్శకాలు బుట్టదాఖలయ్యాయని వారు విమర్శిస్తున్నారు.
న్యూఢిల్లీ : రేషన్ కార్డులు లేని అసంఘటితరంగ కార్మి కులు, వలస కార్మికుల్ని ఆదుకోవాలి..అంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది జూన్ 29న కీలకమైన తీర్పు వెలువరించింది. అత్యంత కీలకమైన సలహాలు, సూచనలతో కేంద్రానికి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. మరి ఇందులో ఏమేమి అమలయ్యాయి? అని దేశంలోని సమాచార హక్కు కార్య కర్తలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని 'ఆహారం, ప్రజా పంపిణీ' విభాగం నుంచి అధికారికంగా సమాచారం విడుదలైంది. దీనిని చదివిన సమాచార హక్కు కార్యకర్తలు సుప్రీం మార్గదర్శకాలేవీ అమలు కాలేదని, మోడీ సర్కార్ కొంత హడావిడి చేసి అసలు విషయాన్ని బుట్టదాఖలు చేసిందనిఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల్ని ఆదుకునే ఉద్దేశంతో సుప్రీం కోర్టు జారీచేసిన మార్గదర్శకాలు ఇటీవల చర్చనీయాంశం అయ్యింది. రాజకీయంగానూ ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. వలస కార్మికుల్లో రేషన్ కార్డుల్లేని వారు ఎంతోమంది ఉన్నారని, వారి గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. దీనివల్ల ఎంతోమంది కార్మికులు, వారి కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులవుతారని అభిప్రాయపడింది. అయితే ఇవేవీ కేంద్రం పెద్దగా పట్టిం చుకోలేదని సమాచార హక్కు కార్యకర్త అంజలీ భరద్వాజ్ చెబుతున్నారు. ఆమె దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం నుంచి విడుదలైన సమాధానం(ఆగస్టు 24న) ఈ విధంగా ఉంది.
ఇప్పుడు కాదు..
''జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 దేశవ్యాప్తంగా అమలవుతోంది. గ్రామాల్లో 75శాతం జనాభా, పట్టణ జనాభాలో 50శాతానికి ఈ చట్టాన్ని వర్తింపజేశాం. వీరికి ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీ ఆహారం అందిస్తున్నాం. 2011-12 ఎన్ఎస్ఎస్ఓ సర్వే ఆధారంగా ఆహార సబ్సిడీ పథకం అమలుజేశాం. సర్వేలో పేర్కొన్న జనాభా లెక్కల ఆధారంగా ఆహార భద్రతా చట్టం అమలు శాతాన్ని తెలియజేస్తున్నాం. తదుపరి జనాభా లెక్కలు వచ్చాక..రాష్ట్రాల వారీగా ఆహార భద్రత ఎంతమందికి అన్నది చెబుతాం. అప్పటివరకూ లేదు'' అని కేంద్రం స్పష్టం చేసింది. వలస కార్మి కులకు రేషన్ సరుకులు అందించడానికి తెలంగాణ, మేఘాలయ రాష్ట్రాలకు మాత్రం అదనంగా ఆహార ధాన్యాల్ని పంపినట్టు కేంద్రం తెలిపింది.
సుప్రీం తీర్పుకు విరుద్ధం : అంజలీ భరద్వాజ్,
హక్కుల కార్యకర్త, సతార్క్ నాగరిక్ సంగటన్
కేంద్రం విడుదల చేసిన సమాచారం ప్రకారం మరో మూడు నాలుగేండ్ల తర్వాతే 'ఆహార భద్రతా చట్టం'పై రివిజన్ ఉంటుందని తేలిపోయింది. సుప్రీం తాజా ఆదేశాలకు ఇది పూర్తి విరుద్ధం. కరోనా నేపథ్యంలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నవారిని ఆదుకోవాలని ఎంతో స్పష్టంగా, సూటిగా సుప్రీంకోర్టు చెప్పింది. వలస కార్మికుల విషయంలో కొన్ని ఉపశమన చర్యలు తీసుకోవాలని తెలిపింది. అయితే కేంద్రం ఇదేమీ పట్టించుకోలేదని ఆర్టీఐ సమాచారం బయటకు వచ్చాక స్పష్టమైంది. ప్రజలపై కరోనా సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల అంశాన్ని సుమోటాగా స్వీకరించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని, ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ(గుర్తింపు సంఖ్య ఇవ్వాలని) నిర్వహించాలని చెప్పింది. అయినా ఇదేమీ కేంద్రానికి పట్టలేదు. దీనివల్ల కోట్లాది కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవ్వాల్సి వస్తోంది. విద్య, వైద్యం, బీమా..తదితర అంశాల్లో వారికి అన్యాయం జరుగుతోందని హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.