Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ వచ్చాక మారుతున్న పథకాల పేర్లు
- పిఎం పోషణ్ మరో ఐదేండ్లు పొడిగింపు
- 2021-22 నుంచి 2025-26 ఐదేండ్లకు రూ.1,30,794 కోట్లు
- ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ: మోడీ అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలపేర్లు మార్చటమే పనిగాపెట్టుకున్నది. తాజాగా మధ్యాహ్నభోజన పథకం పేరును పీఎం పోషణ్గా మార్చింది. పాఠశాలల్లో విద్యార్థులకు రోజుకు ఒకసారి వేడి భోజనాన్ని అందించడానికి రూపొందిన పీఎం పోషణ్ జాతీయ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. మరో ఐదేండ్లపాటు ఈ పథకాన్ని పొడిగిస్తూ ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకున్నది. అలాగే 2021-22 నుంచి 2025-26 వరకు రూ.1,30,794.90 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశమైంది. ఈ పథకానికి అవసరమైన నిధుల్లో రూ.54,061.73 కోట్లను కేంద్ర ప్రభుత్వం, రూ.31,733.17 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమకూరుస్తాయని తెలిపింది. ఆహార ధాన్యాలకు అయ్యే అదనపు భారంగా రూ. 45 వేల కోట్లను కేంద్రం భరిస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఈ పథకం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక పూట భోజనం పెట్టనున్నారు. ఇదివరకు దీనిని మధ్యాహ్న భోజన పథకంగా అమలు చేశారు. మంత్రివర్గం ఆమోదించిన పథకం దేశంలో 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుందని కేంద్రం పేర్కొంది. 2020-21లో పథకాన్ని అమలు చేయడానికి ఆహార ధాన్యాల ధరతో కలుపుకుని కేంద్రం రూ.24,400 కోట్లు కేటాయించిందని తెలిపింది. పథకాన్ని మరింత పటిష్టంగా, సమర్ధంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ఎనిమిది అంశాలను అమలు చేయాలని నిర్ణయించింది.
- ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల్లో ప్రాథమిక తరగతులతో సహా ప్రీ-ప్రైమరీ లేదా పిల్లలు చదివే (బాల వాటికల్లో) మొత్తం 11.80 కోట్ల మందికి ఈ పథకాన్ని వర్తించాలి.
- తిథిభోజన విధానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. తిథిభోజన విధానం సామాజిక కార్యక్రమంగా అమలు జరుగుతుంది. దీనిలో ప్రజలు ప్రత్యేక సందర్భాల్లో, పండుగల్లో పిల్లలకు ప్రత్యేక ఆహారాన్ని అందించాలి.
- ప్రకృతి, ఉద్యానవనంతో పిల్లలు మమేకమయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనికోసం పాఠశాలల్లో పోషకాహారాన్ని అందించే పంటలు, తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీటిలో అదనపు సూక్ష్మ పోషకాలతో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులను పథకంలో వినియోగిస్తారు. ఇప్పటికే 3 లక్షలకు పైగా పాఠశాలల్లో ఇటువంటి తోటలు అభివృద్ధి చేయబడ్డాయి.
ఈ పథకం సామాజిక ఆడిట్ అన్ని జిల్లాలలో తప్పనిసరి చేయబడింది.
- రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాలు, జిల్లాల్లోని పిల్లలకు అదనపు పోషకాహార వస్తువులను అందించడానికి ప్రత్యేక ఏర్పాటు చేయబడింది.
- స్థానికంగా లభ్యమయ్యే పదార్థాలు, కూరగాయల ఆధారంగా వంటకాలు సిద్ధం చేయడానికి, వినూత్న పదార్ధాలను భోజనంతో పాటు అందించడానికి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిలలో వంట పోటీల నిర్వహణను ప్రోత్సహించాలి.
- ఆత్మనిర్భర్ భారత్ సాధన దిశలో భాగంగా పథకం అమలులో రైతుల ఉత్పత్తి సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాలకు పథకం అమలులో ప్రాధాన్యత లభిస్తుంది. స్థానికంగా ఆర్ధిక పురోగతి సాధించడానికి, స్థానికంగా లభించే సాంప్రదాయ ఆహార పదార్థాల వినియోగానికి ప్రోత్సహించడం జరుగుతుంది.
- ప్రగతి పర్యవేక్షణ, తనిఖీల కోసం ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, ప్రాంతీయ విద్యా సంస్థల, జిల్లా విద్యా, శిక్షణ సంస్థ లలో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుంది.
స్టాక్ ఎక్చ్సేంజ్లో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ
కార్పొరేషన్ లిమిటెడ్
స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్ నమోదు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ) మెసర్స్ ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఈసీజీసీ) సెబి నిబంధనలు-2018 పరిధిలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) మాధ్యమం ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయడానికి ఆమోదించింది. నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్ఈఐఏ) స్కీమ్ కొనసాగించడానికి ఐదేండ్ల పాటు రూ. 1,650 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్కు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఎన్ఈఐఏ రూ. 33 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఎగుమతులకు మద్దతు ఇస్తుందనీ, అసంఘటిత రంగంలో 2.6 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి సహాయం చేస్తుందని తెలిపింది. ఎగుమతిదారులకు, బ్యాంకులకు మూలధన మద్దతు అందించడానికి ఈసీజీసీ లిమిటెడ్లో ఐదేండ్లలో రూ.4,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. సంఘటిత రంగంలో 2.6 లక్షల ఉద్యోగాలతో పాటు, మొత్తం 59 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొంది.
రెండు రైల్వే డబ్లింగ్ లైన్లకు
కేంద్ర మంత్రివర్గం ఆమోదం
దేశంలోని రెండు రైల్వే లైన్ల డబ్లింగుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో నీమచ్-రత్లామ్ రైల్వే లైను, రాజ్ కోట్- కనాలూస్ రైల్వే లైను డబ్లింగుకు ఆమోదం తెలిపింది. నీమచ్-రత్లామ్ రైల్వే లైను డబ్లింగు ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.1,095.88 కోట్లు కాగా, పూర్తి అయ్యేసరికి రూ.1,184.67 కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. ఈ రైల్వేలైను డబ్లింగ్ 132.92 కిలో మీటర్లు పొడవు ఉంటుంది. అలాగే రాజ్ కోట్- కనాలూస్ రైల్వే లైను డబ్లింగు ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.1,080.58 కోట్లు కాగా, పూర్తి అయ్యేసరికి రూ.1,168.13 కోట్లకు పెరగవచ్చని పేర్కొంది. ఈ రైల్వేలైను డబ్లింగ్ 111.20 కిలో మీటర్లు పొడవు ఉంటుంది.