Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వయిజరీ నియామకంపై కార్మికుల నిరసన వెల్లువ
- పోస్కో, అదానీకి అప్పగించే బీజేపీ కుట్రలను తిప్పికొడతాం : సిహెచ్.నర్సింగరావు
విశాఖపట్నం:విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వంద శాతం వ్యూహాత్మక అమ్మకంలో భాగంగా ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజరీ నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించడాన్ని నిరసిస్తూ ఉక్కు కర్మాగారం లోపలకు వెళ్లే అన్ని దారులనూ గురువారం దిగ్బంధనం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు వేలాది మంది కార్మికులు ప్రధాన ద్వారాలకు అడ్డుగా బైటాయించి నిరసన తెలిపారు. ఉక్కు పరిపాలన భవనం, ప్లాంట్ మెయిన్ గేట్, బాలచెరువు (బీసీ) గేట్ సహా ఏడు గేట్లదారులనూ దిగ్బంధం చేశారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, ప్రాణాలైనా అర్పిస్తాం-స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షిస్తాం' అంటూ నినదించారు. ఈ నిరసనలతో ప్లాంట్ మార్గాలన్నీ మూసుకు పోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోరాటాన్ని నీరుగార్చడానికి స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కుటిల ప్రయత్నం చేసింది. జనరల్ షిఫ్ట్‌కి రావాల్సిన ఉద్యోగులను సైతం 'ఎ' షిఫ్టుకు రావాలని ఆదేశించింది. అయినా, అధిక శాతం మంది జనరల్ షిఫ్టు కార్మికులు 11 గంటల వరకు ఈ దిగ్బంధంలో పాల్గొని తర్వాత విధులకు హాజరయ్యారు.