Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికలు, మహిళలపై అంతులేని అఘాయిత్యాలు.
- హత్రాస్ గుడియా జ్ఞాపకార్థం నిర్వహించిన జాతీయ సమావేశంలో వక్తలు
న్యూఢిల్లీ. యూపీలోని హత్రాస్‌లో దళిత బాలిక దారుణహత్యకు గురై ఏడాదైనా.. ఇంతవరకూ న్యాయం జరగలేదని మహిళా సంఘాలు, మానవహక్కుల సంస్థల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళిత బాలికలు, మహిళల రక్షణ కోసం ఏకమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వారు నొక్కి వక్కానించారు. ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్ క్లబ్ లో ''దళిత మహిళలు, బాలికలకు రక్షణ అంశంపై జాతీయ సమావేశం'' నిర్వహించారు.ఈ సమావేశంలో దళితులు-ఆదివాసీలు-వెనుకబడిన- అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.అగ్రవర్గాలకు అండగా నిలిచే పాలకులు, దళితులపై దారుణాలు జరుగుతున్నా..పట్టించుకో వటంలేదని విమర్శించారు. హత్రాస్ దారుణం జరిగి ఏడాదైనా..ఈ కేసు విషయంలో ఇంకా పురోగతిలేదన్నారు. ఎస్సీ,ఎస్టీలపై దారుణాలు జరిగినపుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారించడానికి ఒక నిబంధన ఉన్నది. 60 రోజుల్లోపు న్యాయం జరగాలి. హత్రాస్ హత్యాచారం కేసు ఇప్పటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని వివరించారు. కాన్ఫరెన్స్‌లో ఆల్ ఇండియా దళిత మహిళా అధికార్ మంచ్ ప్రధాన కార్యదర్శి అభిరామి మాట్లాడుతూ... హత్రాస్‌లో దళిత బాలిక సామూహిక లైంగికదాడి, హత్యకు గురై ఏడాది గడిచినా న్యాయం జరగలేదన్నారు. అందుకే 25 సంఘాలు ఒక్కటై గళమెత్తాలని నిర్ణయించామన్నారు. దళిత బాలికకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తూనే ఉంటామన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జనరల్ సెక్రెటరీ అన్నీ రాజా మాట్లాడుతూ.. హత్రాస్ ఘటనపై తమ సంస్థ తీవ్రంగా చర్చిస్తున్నదని చెప్పారు. దళిత అమ్మాయికి న్యాయం జరిగేదాకా..రాజ్యాంగపరమైన పోరాటం చేస్తామన్నారు.ప్రొఫెసర్ హేమ్లాతా మహీశ్వర్ మాట్లాడుతూ పితృస్వామ్యం సమాజానికి అతిపెద్ద శత్రువు అని తెలిపారు. ఆచారాల సంకెళ్లను విచ్ఛిన్నం చేయాలి. న్యాయం పొందడానికి, రాజ్యాంగ సంస్థల ముందు నిరసన తెలియజేయాల్సిన అవసరమున్నదన్నారు.
ఎన్సీఆర్బీ గణాంకాలు పరిశీలిస్తే...చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని దళిత మానవ హక్కుల జాతీయ ప్రచార కో-కన్వీనర్ , ప్రముఖ సామాజిక కార్యకర్త ,రచయిత ప్రొఫెసర్ విమల్ థోరట్ అన్నారు. కులం ఉన్నంత వరకు దళితులపై అఘాయిత్యాలు కొనసాగుతాయని వివరించారు. ముఖ్యంగా దళిత మహిళలు వేధింపులకు గురవుతూనే ఉంటారు, ఇలాంటి చర్యలను తిప్పికొట్టడానికి పోరుబాట ఒక్కటే మార్గమన్నారు. హత్రాస్ బాలిక కేసుపై పోరాడుతున్న న్యాయవాది సీమా కుశ్వాహా మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అభివర్ణించారు. దారుణం జరిగాక..కేసును తారుమారుచేయటానికే మృతదేహాన్ని పోలీసులు దగ్గరుండి కాల్చేశారని తెలిపారు. యోగి సర్కార్‌పై చట్టం ద్వారానే గెలవలేమనీ, దీని కోసం సామాజిక సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
బాధిత కుటుంబంపై యోగి సర్కార్ నిఘా..
నిరంతరం పోలీసుల పర్యవేక్షణ కారణంగా..బాధిత కుటుంబం ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటోంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది, బాధితురాలి కుటుంబం గృహ నిర్బంధానికి గురవుతుంది, ఎక్కడికి వెళ్లాలన్నా..ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకుని వెళ్లాల్సివస్తున్నదని వక్తలు వివరించారు.ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా దళిత మహిళా అధికార్ మంచ్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా సెక్యులర్ ఫోరం, దళిత ఆర్థిక అధికారి మంచ్, దళిత ఆదివాసీ శక్తి అధికారి మంచ్, ఢిల్లీ సాలిడారిటీ గ్రూప్, ఇండియన్ క్రిస్టియన్ ఉమెన్స్ మూవ్మెంట్, ఇండియన్ సోషల్ యాక్షన్ ఫోరమ్, కబీర్ కళా మంచ్, ముస్లిం మహిళా ఫెడరేషన్, నేషనల్ అలయన్స్ పీపుల్స్ మూవ్మెంట్, నేషనల్ అలయన్స్ ఫర్ ఉమెన్ ఆర్గనైజేషన్, దళిత్ హ్యూమన్ ఆర్ఐటీఎస్ తదితర సంఘాలు నిర్వహించాయి.
హత్రాస్ కేసులో డిమాండ్లు ఇవే..
- బాధిత కుటుంబ పునరావాసం కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్డు కులాలు , షెడ్యూల్ రూల్ 12 (4) ప్రకారం కుటుంబంలోని ఏ ఒక్కరికీ ఒక ఇల్లు ఉండేలా చట్టంలో పేర్కొన్నది.అలానే ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేయాలి.
- హత్రాస్ కుటుంబానికి సత్వర న్యాయం జరగాలి. షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగల చట్టం సెక్షన్ 14 (2) ప్రకారం కేసు విచారణ త్వరితగతిన జరగాలి. రోజువారీ విచారణకు ఏర్పాట్లు చేయాలి.
- హత్రాస్ కేసులో.. ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించిన పోలీసు అధికారులపై (ఎస్ఐటీ) సమర్పించిన నివేదికపై లక్నో హైకోర్టు తక్షణ నిర్ణయం తీసుకోవాలి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సెక్షన్ 4 కింద పేర్కొన్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
- హత్రాస్ ఘటనలో బాధితురాలి కుటుంబానికి సహకరించిన న్యాయవాదికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భద్రత కల్పించాలి. కేసు నుంచి ఉపసంహరించుకోవాలని నిరంతరం ఒత్తిడి చేస్తుండటం పట్ల సమావేశం ఆందోళన తెలిపింది.
- కేరళకు చెందిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలి. ఆ ఎపిసోడ్‌ను కవర్ చేసినందుకు హత్రాస్ గ్రామానికి వెళుతూ అరెస్టు చేశారు. ఇంకా జైలులో ఉన్నాడు.
- దళిత మహిళలు, బాలికలపై కుల, లింగ ఆధారిత హింసను నిరోధించడానికి షెడ్యూల్ కులాలు , షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీల నిరోధం) చట్టం 1989, సవరణ చట్టం 2015 ప్రకారం సమర్థవంతంగా.. కఠినంగా అమలు చేయాలి.
- దళితులపై.. ప్రధానంగా దళిత మహిళలపై హింసను నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. దళిత సమాజంలో చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ద్వారా ఉద్యమాలు/కార్యక్రమాలు నిర్వహించాలి.
- షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగల (అరాచకాల నిరోధం) చట్టంలోని సెక్షన్ 15 (ఎ) లో అందించబడిన ''బాధితులు, సాక్షుల హక్కులు'' లైంగిక వేధింపుల కేసులలో న్యాయం సాధించే విధానాలపై అవగాహన కల్పించడం. ప్రజా ప్రచారం నిర్వహించాలి.
- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సెక్షన్ 14 ప్రకారం (అట్రాసిటీల నిరోధం), రెండు నెలల్లో కేసును సత్వరమే పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు , ప్రత్యేకమైన ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు ఉండేలా చూడాలి.