Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల విద్యుత్తు ఉద్యోగుల విభజనకు సంబంధించిన కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం తెలిపింది. విద్యుత్తు ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫార్సులు తెలంగాణ విద్యుత్తు సంస్థలు అమలు చేయడంలేదంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలుచేశారు. 655 మంది ఉద్యోగులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, అదేవిధంగా 655 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పంపాలని జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫార్సు చేసింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిందని ఏపీ ఉద్యోగుల తరపు సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ కోర్టుకు తెలిపారు. 2020 నాటికి పదవీ విరమణ చేసే వారిని విభజన జాబితాలో చేర్చలేదని తెలిపారు. ఏపీ రిలీవ్ చేసిన ఉద్యోగులను తెలంగాణ చేర్చుకోవడం లేదని తెలంగాణ రిలీవ్‌చేసిన వారిని ఏపీ చేర్చుకుందని తెలిపారు. ఏపీ ఉద్యోగులకు తెలంగాణ డిస్కంలు గతేడాది డిసెంబరు నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ డిస్కంల అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని అహ్మదీ కోరారు.
తెలంగాణ డిస్కంల తరపు సీనియర్న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పదవీ విరమణ నేపథ్యంలో ఆంధ్ర డిస్కంల కన్నా తెలంగాణ డిస్కంలు ఎక్కువ మందిని డ్రాప్ చేశాయని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ నుంచి 605 మంది ఉద్యోగులు తెలంగాణకు రాగా, తెలంగాణ నుంచి 520 మంది మాత్రమే ఏపీకి వెళ్లారన్నారు. ఏపీ అదనంగా 84 మంది ఉద్యోగులను పంపిందని తెలిపారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది పదవీ విరమణ పొందారు కాబట్టి, ఏపీ రిలీవ్ చేసే వారిలో ఆ మేరకు మినహాయించుకోవాల్సిందేనని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్, న్యాయవాది రాజగోపాలరావులు వాదనలు వినిపిస్తూ ఉద్యోగులు పదవీ విరమణ చేసినంత మాత్రానా జాబితాలో మార్పులు చేయడానికి వీల్లేదన్నారు. ఉద్యోగులు ఎక్కువైనా తక్కువైనా జస్టిస్ ధర్మాధికారి కమిటీని సిఫార్సులు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. 17 మంది ఎస్సీఎస్టీ ఉద్యోగుల తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ వేరుగా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.