Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో నాలుగు రెట్లు పెరిగిన ఆదాయం
- పదేండ్లలో పుట్టుకొచ్చిన పది రెట్ల కుబేరులు
- ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ జాబితా వెల్లడి
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ కార్పొరేట్లు అదానీ, అంబానీ సంపాదనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా అదానీ సంపాదన కళ్లు చెదిరే వేగంతో పెరుగుతున్నది. వారికి అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, అండదండలతో పలు కంపెనీలు, ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్న అదానీ.. ప్రస్తుతం రోజుకు రూ.1000 కోట్లు పైగా పోగేసుకుంటున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్-2021 రిపోర్ట్ ప్రకారం.. ఓవైపు కరోనాతో ప్రపంచమంతా విలవిల్లాడుతుంటే.. మన కుబేరులు మాత్రం భారీగా సంపద వెనుకేసుకుంటున్నట్టు స్పష్టం చేస్తున్నది. ఒకే ఒక్క ఏడాదిలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం సంపద ఏకంగా నాలుగు రెట్లు పెరిగడం తాజా జాబితాలో ఆశ్చర్యకరమైన విషయం. 2019-20లో రూ.1.4 లక్షల కోట్లుగా ఉన్న అదానీ సంపద.. 2020-21లో రూ.5.06 లక్షల కోట్లకు ఎగిసింది. సగటున రోజుకు రూ.1002 కోట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ కంటే కూడా వేగంగా అదానీలు సంపద సష్టించారు. ఈ జాబితా ప్రకారం గతేడాది భారత్‌లో 119 నగరాల్లో కనీసం రూ.1000 కోట్ల సంపద ఉన్న 1007 మంది వ్యక్తుల సంపద 51 శాతం పెరిగింది.
సంపద విషయంలో దేశంలో అత్యంత కుబేరుడిగా ముకేష్ అంబానీ తొలి స్థానంలో నిలిచారు. గత పదేళ్లుగా వరుసగా ఆయన తొలి స్థానంలోనే కొనసాగుతున్నారు. రెండో స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు.
ఆసియాలోనే అత్యంత ధనవంతుల్లో చైనాకు చెందిన ఝాంగ్ షాన్షాన్ను అదానీ వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరారు. గౌతమ్ అదానీతోపాటు ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీకి కూడా ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. గతేడాది ముకేష్ అంబానీ రోజువారీ సంపాదన రూ.169 కోట్లుగా నమోదయ్యింది. ఆయన మొత్తం సంపద 9 శాతం పెరిగి రూ.7.18 లక్షల కోట్లకు చేరింది. హెచ్‌సిఎల్ అధినేత శివ్ నాడార్ కుటుంబ సంపద ఏకంగా 67 శాతం పెరిగి రూ.2.36 లక్షల కోట్లకు ఎగిసింది. గతేడాది ఆయన ప్రతి రోజూ రూ.260 కోట్లు సంపాదించారు. ఉక్కు కార్పొరేట్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ కుటుంబం గతేడాది రోజుకు రూ.312 కోట్ల సంపదను ఆర్జించింది. వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనావాలా, ఆయన కుటుంబం గతేడాది ఏడాదికి రూ.190 కోట్లు సంపాదించింది. యువ బిలియనీర్‌గా భారత్‌పె పేమెంట్స్ యాప్ కోఫౌండర్ శాశ్వత్ నక్రానీ గుర్తింపు తెచ్చుకున్నారు.
కొత్తగా 58 మంది కుబేరులు
దేశంలో ఓ వైపు కరోనా దెబ్బతో అనేక మంది సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఉన్న అదాయాలను కోల్పోగా.. మరోవైపు దేశంలో కుబేరులు అమాంతం పెరిగిపోతున్నారు. గతేడాది కొత్తగా 58 మంది బిలియనీర్లు చేరారని హురూన్ ఇండియా ఎండి, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ తెలిపారు. దీంతో దేశంలో 2020-21లో మొత్తం కుబేరుల సంఖ్య 258కి చేరిందన్నారు. పదేండ్లలో పది రెట్లు పెరిగారన్నారు. పదేండ్ల కిందట మా లిస్ట్‌లో కేవలం 100 మంది ఉన్నారనీ.. ప్రస్తుతం వారి సంఖ్య 1007కు చేరిందన్నారు. ఇదే వేగం కొనసాగితే వచ్చే ఐదేండ్లలో తమ జాబితాలో 3వేల మంది ఉండొచ్చని అంచనా వేశారు. కొత్తగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్న వారిలో అధికశాతం మంది రసాయనాలు, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన వారు కాగా.. ఫార్మా రంగం నుంచి అత్యధికంగా 130 మంది ఈ జాబితాలో ఉన్నారు.