Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఎం-యూ, అమృత్ రెండో దశను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : స్వచ్ఛభారత్ మిషన్-అర్బన్ (ఎస్బీఎం-యూ), అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) పథకాల రెండవ దశను శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగరాలను చెత్త రహితంగా, నీటిని సురక్షితంగా మార్చడమే ఈ మిషన్లు లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు. అసమానతలను తొలగించేందుకు పట్టణాభివృద్ధి చాలా కీలకమని అంబేద్కర్ విశ్వసించే వారని, అంబేద్కర్ కలలను సాకారం చేయడంలో ఈ పథకాల ంండో దశ చాలా ముఖ్యమైనదని అన్నారు.
పరిశుభ్రతపై ప్రచారాన్ని బలోపేతం చేసేందుకు యువత కీలకమైన చొరవ తీసుకుందని మోడీ పేర్కొన్నారు. మన దేశంలో రోజువారీ వ్యర్థాల్లో 70 శాతం వరకు ప్రాసెసింగ్ జరుగుతోందని, దీనిని నూటికి నూరు శాతానికి పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. ఈ రెండో దశలో మురుగు నీటి పారుదల, భద్రతా నిర్వహణలను సాధించాలనుకుంటున్నామని, నగరాల్లో నీటి భద్రత కల్పించడం, మురికి నీరు నదుల్లో కలవకుండా చర్యలు తీసుకోవడం ఈ పథకాల లక్ష్యాలని తెలిపారు.
పరిశుభ్రతను కాపాడుకోవడం అనేది కేవలం ఒక రోజు, నెల, ఒక సంవత్సరం లేదా కొంతమంది వ్యక్తులకో పరిమితం కాదు. ప్రతిరోజూ, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నిరంతరంగా జరగాల్సిన కార్యక్రమం ఇది.
ఒక తరం నుంచి మరో తరానికి ఇది ఒక మెగా క్యాంపెయిన్ వంటిదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి అని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పట్టణాభివద్ధి శాఖల మంత్రులు పాల్గొన్నారు.