Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రైతు ఆందోళన కేంద్రాల్లో దీక్షలు చేయనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని ఎస్కేఎం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదనీ, అన్ని ప్రాంతాల్లో ఉపవాసాలు చేపడుతున్నామని పేర్కొన్నది. బాపు సత్యాగ్రహం, సత్యం, అహింస సూత్రాలు తమ పోరాటంలో తమకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ఎస్కేఎం స్పష్టం చేసింది. గాంధీ జయంతి సందర్భంగా వేలాది మంది రైతులు చంపారన్ నుంచి వారణాసికి 18 రోజుల మార్చ్ ప్రారంభిస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి రైతులు పాదయాత్రలో పాల్గొంటారు. 1917లో చంపారన్‌లో మహాత్మా గాంధీ నీలిమందు రైతుల కోసం తన మొదటి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అన్యాయానికి వ్యతిరేకంగా శాంతియుత పోరాట ఆయుధాన్ని ఇచ్చారని తెలిపింది.
జాతీయరహదారులను అడ్డుకున్నది బీజేపీ పోలీసులే...
సుప్రీం కోర్టు కేసుతో ఎస్కేఎంకి ఎలాంటి సంబంధం లేదనీ, తాము ఎప్పుడూ సుప్రీం కోర్టును సంప్రదించలేదని స్పష్టం చేసింది. ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారులను బీజేపీ ప్రభుత్వాల పోలీసులు అడ్డుకున్నారని ఎస్కేఎం ఎప్పుడూ చెబుతున్నదని పేర్కొంది. రైతుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించడం ద్వారా నిరసనను పరిష్కరించవచ్చనని కేంద్ర ప్రభుత్వానికి తెలుసని పేర్కొంది. వందలాది మంది రైతులు అమరులైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించటం లేదని విమర్శించింది. హర్యానా, పంజాబ్‌లో వరి సేకరణను మరో పది రోజులు ఆలస్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. పంజాబ్‌లో దాదాపు 9 లక్షల టన్నుల వరి సేకరణను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను రైతులు తమ పంటలను విక్రయించే హక్కును, పంటలకు గిట్టుబాటు ధరను పొందే హక్కును హరించేవని ఎస్కేఎం తెలిపింది.