Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఝజ్జర్: నల్లచట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ మంత్రు లు,ప్రజాప్రతినిధులకు రైతు సెగలు తాకుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలోని ఝజ్జర్‌లో ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాకి నిరసన సెగ తాకింది. ఇక్కడ జరిగే ఓ కార్యక్రమానికి దుష్యత్ వస్తున్నారని తెలియగానే.. రైతులు నిరసన తెలియజేయటానికి వచ్చారు. శుక్రవారం ఉదయం భారీ సంఖ్యలో మహిళా రైతులు కూడా నల్లచట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. అటు వైపుగా వస్తున్న డిప్యూటీ సీఎం దృష్టిలో పడకుండా.. పోలీసులు దురుసుగా వ్యవహరించారు. శాంతియుతంగా నల్లజెండాలతో నిరసన ప్రదర్శ చేస్తున్న రైతులను పోలీసులు అమాంతంగా నెట్టేశారు. తేరుకునేలోపు జలఫిరంగులు ప్రయోగించారు. ఇంతజరిగినా రైతులు వెనక్కి తగ్గలేదు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టివేసి నిరసన తెలిపారు. కాగా నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల నుంచి హర్యానా ప్రజాప్రతినిధులకు నిరసన సెగలు తాకుతూనే ఉన్నాయి. గతంలో పలుమార్లు జలఫిరంగులు ప్రయోగించినా..అన్నదాతలు తమ ఆందోళనల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పర్యటనకు ఆటంకం కలగకుండా భారీ భద్రతబలగాలు మొహరించాయి. బారికేడ్లు అమర్చారు. డిప్యూటీ సీఎం వెళ్లే రూటు మార్చారు. అయినా రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తుండటంతో...శాంతియుతంగా ప్రదర్శన చేసుకోమని అధికారులు సూచించారు. ఈ లోపు జలఫిరంగులతో పోలీసులు దాడికి దిగారని రైతు నేతలు తెలిపారు. అన్నదాతలపై హర్యానా సర్కారు అవలంబిస్తున్న వైఖరిపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.