Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అకృత్యాలపై విచారణ
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీ : సీజేఐ
న్యూఢిల్లీ : దేశంలో అధికారులు ప్రధానంగా పోలీసులు పాల్పడే అకృత్యాలపై సాధారణ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై విచారణ చేసేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ శుక్రవారం పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో పోలీసులు కూడా తీవ్రమైన నేరాలకు పాల్పడున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీజేఐ మౌఖికంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని హోటల్లో జరిగిన సోదాల సందర్భంగా ఒక వ్యాపారవేత్త మరణానికి పోలీసులే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. తమళనాడులో పి.జయరాజ్, బెనిక్స్ అనే ఇద్దరు తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో సిబిఐ తొమ్మిది మంది పోలీసు అధికారులపై ఛార్జిషీట్ వేసింది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తనపై మోపిన రాజద్రోహం, దోపిడీ, నేరపూరిత తదిరత క్రిమినల్ కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సస్పెండెడ్ అదనపు డీజీపీ గుర్జిందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులు లక్ష్యంగా మారడం విచారకరమైన పరిస్థితి అని పేర్కొంది. 'ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు ఒక నిర్దిష్ట పార్టీ వైపు ఉంటారు. తర్వాత మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం సదరు అధికారులపై చర్యలు తీసుకుంటుంది'' అని రమణ అన్నారు. ఈ కొత్త ట్రెండ్‌ను కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.