Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సంక్షోభం నెలకొంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకొంటున్నప్పటికీ నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు కుటుంబాల ఆదాయాలు తగ్గడంతో వారి భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొందన్నారు. పారిశ్రామికవేత్తల సంఘం పీహెచ్‌డీసీసీఐ సమావేశంలో దువ్వూరి మాట్లాడుతూ ప్రస్తుతం నిరుద్యోగమనేది సమస్య కాదని.. అది ఒక సంక్షోభమని అన్నారు. సంఘటితరంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయన్నారు. దేశ వృద్ధిరేటును వేగవంతం చేయడంతో పాటుగా.. వృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడాల్సి ఉందన్నారు. అధిక వృద్ధి సాధించడమే కాదని.. పెరుగుతున్న అసమానతల్ని తగ్గించాలని సూచించారు. వృద్ధి కోసం దేశం కేవలం వినియోగం మీదే ఆధారపడితే కుదరదని అన్నారు. ప్రయివేటు వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతుల ద్వారా ఆర్థికాభివద్ధి జరగాలని సూచించారు. సమాజంలో అసమానతలు పెరుగుతుంటే మరోవైపు కార్పొరేట్ల లాభాలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. చిన్న కంపెనీల మార్కెట్ వాటాను పెద్ద కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. దీంతో దేశంలో పెరుగుతున్న అసమానతలకు ఇదే నిదర్శనమన్నారు.