Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కీర్తిశేషులు లావు బాలగంగాధరరావు (ఎల్బీజీ) సతీమణి సరోజిని (92) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కాటూరులో 1930 జులై 6న కమ్యూనిస్టు కుటుంబంలో సరోజిని జన్మించారు. ఎల్బీజీతో 1947లో సరోజినికి వివాహమైంది. ఎమ్ఏ పాలిటిక్స్, బీఈడీ చేసిన ఆమె గుంటూరు జిల్లా తెనాలి, విజయవాడ మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశారు. 1989లో ఉద్యోగ విరమణ చేశారు. కొన్ని సంవత్సరాలుగా విశాఖలోని మాధవదార ఉడాకాలనీలోని ఎమ్ఐజీ 12లో నివాసముంటున్న తన కుమారుడు ప్రేమ్ సాగర్, కోడలు శోభారాణి వద్ద ఉంటున్నారు. ఎల్బీజీకి సంపూర్ణంగా సహకరిస్తూ, కుటుంబ బాధ్యతలను చూస్తూ ఇంటికొచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆదరించేవారు. సరోజిని భౌతికకాయాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఆంధ్ర మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్టు ప్రేమ్ సాగర్ తెలిపారు.
తమ్మినేని సంతాపం
లావు బాలగంగాధరరావు సతీమణి సరోజనమ్మ మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సరోజనమ్మ మరణానికి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ రాఘవన్, బి వెంకట్ సంతాపం ప్రకటించారు.