Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయస్థానాలపై విశ్వాసాన్ని నిలుపుకోవాలి
- మీరు నగరాన్నే ఉక్కిరిబిక్కిరి చేశారు
- రైతు ఆందోళనలపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలను సవాల్ చేసిన తరువాత నిరసనల వల్ల ప్రయోజనమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేయడానికి అనుమతించాలని కోరుతూ కిసాన్ మహా పంచాయత్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్.. నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతుల వైఖరిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయస్థానాల్లో వ్యవసాయ చట్టాలను సవాలు చేసిన తరువాత, నగరం గొంతు కోసి మీరు నిరసనలు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. నిరసన తెలిపే రైతులు నిరసనలను కొనసాగించే బదులు వ్యవస్థ, న్యాయస్థానాలపై విశ్వాసాన్ని నిలుపుకోవాలని సూచించింది. ఒకవేళ మీకు కోర్టులపై నమ్మకం ఉంటే, నిరసనకు బదులుగా అత్యవసర విచారణ కోసం దాన్ని కొనసాగించండని వ్యాఖ్యానించింది. విచారణ సమయంలో న్యాయస్థానం నిరసనకారుల వల్ల సాధారణ ప్రజలకు జరిగే అసౌకర్యాన్ని వివరించింది. ''మీరు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసారు. ఇప్పుడు మీరు నగరం లోపలికి వచ్చి నిరసన తెలియజేయాలనుకుంటున్నారు. దీన్ని ఆపాలి. మీరు హైవేలు, రోడ్లను బ్లాక్ చేసారు'' అని ధర్మాసనం పేర్కొంది.
నిరసనకారులు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారనీ, భద్రతా సిబ్బందిని కూడా ఎగతాళి చేస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ రైతు సంఘాల నిరసనల్లో భాగం కాదని కూడా ఆయన అన్నారు. నిరసనల్లో పాల్గొనడం లేదని పేర్కొంటూ ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ని ధర్మాసనం కోరింది. అటార్నీ జనరల్‌కు పిటిషన్ ముందస్తు కాపీని అందించాలని పిటిషనర్‌ను ధర్మాసనం కోరింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 4 (సోమవారం) నాటికి వాయిదా వేసింది.