Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్
- కమర్షియల్ సిలిండర్‌పై తాజాగా రూ.43 పెంపు
న్యూఢిల్లీ : సామాన్యుడిపై మరోసారి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారాల మోత మోగించింది. దీంతో, దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆయిల్ కంపెనీల గణాంకాల ప్రకారం శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. మూడు వారాల స్వల్ప విరామం తర్వాత ఇటీవల పెట్రోల్‌పై మూడుసార్లు, డీజిల్‌పై ఆరు సార్లు ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.43 పెంచింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. చమురు ధర పెరిగితే ఇక్కడి ధరలను పెంచిన కేంద్రం చమురు ధర తక్కువగా ఉన్న సమయంలో అందుకు అనుగుణంగా ధరలు తగ్గించకుండా దానికి సరిపడా ఎక్సైజ్ సుంకాలను పెంచుతూ సామాన్యుడి పెట్రో భారాన్ని కొనసాగించింది. రాష్ట్ర పన్నుల వాటా పెద్దగా మారలేదు. 2015-16, 2020-21 ఆర్థిక సంవత్సరాల మధ్య కేంద్రం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం రూపంలో దాదాపు రూ.16 లక్షల కోట్ల మేర పొగేసుకుంది. ముడి చమురు ధర పెరిగినప్పుడూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచీ, తగ్గినప్పుడు కూడా పెంచితే ప్రజల సంక్షేమం పట్ల మోడీ సర్కార్‌కు ఉన్న నైతికత ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో పెట్రోలు ధర 25 పైసలు పెరగడంతో లీటరు ధర రూ.101.64 నుంచి రూ.101.89కు చేరింది. ఇక డీజీల్‌పై 30 పైసల పెంపుతో రూ.90.17గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.107.95, డీజిల్ రూ.97.84 ఉంది. హైదరాబాద్‌లో పెట్రోలు 26 పైసలు పెరిగి రూ.106కు, డీజిల్ 33 పైసలు పెరిగి రూ.99.08 వద్దకు చేరింది. విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం నాడు వరుసగా రూ.107.54, రూ.99.67 ఉండగా, అది శుక్రవారం రూ.107.79, రూ.99.67కు పెరిగింది.
రూ.43 పెరిగిన గ్యాస్ ధర
నెల రోజుల వ్యవధిలో మరోసారి ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. సిలిండర్ ధరను మరో రూ.43.50 పెంచింది. సెప్టెంబరు 1న ఇవే సిలిండర్ల గ్యాస్ ధరను రూ.75 పెంచింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.123 పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ రూ.1,952, విజయవాడలో రూ.1,916, విశాఖలో రూ.1,825, ఢిల్లీలో రూ.1736 గా ఉండగా.. కోల్‌కతాలో రూ.1805.5గా ఉంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు స్ట్రీట్‌ఫుడ్ దుకాణాలు, చిన్న, మధ్య తరగతి హోటళ్లకు భారంగా మారనున్నాయి.