Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొరతతో తయారీపై ప్రభావం
- సెప్టెంబర్‌లో పడిపోయిన అమ్మకాలు
న్యూఢిల్లీ : ప్రస్తుత పండుగ సీజన్ ఉత్పత్తి, అమ్మకాలపై వాహన కంపెనీలు ఆందోళనకు గురైతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సెమీకండక్టర్ చిప్‌ల కొరత భారత్‌లో వాహన పరిశ్రమను తీవ్ర ప్రతికూలతలోకి నెట్టుతోంది. ఇప్పటికే సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ చిప్‌ల కొరత వేధించడంతో సెప్టెంబర్ విక్రయాల్లో పతనం చోటు చేసుకుంది. దీంతో వచ్చే దసరా, దీపావళి పండుగ సీజన్ డిమాండ్‌ను చేరుకోగలమా అని పరిశ్రమలో ఆందోళన నెలకొంది. గడిచిన మాసంలో మారుతీ సుజుకీ, హ్యుందారు, మహీంద్రా అండ్ మహీంద్రాతో సహా ఆటో పరిశ్రమలో పలు కంపెనీల అమ్మకాల పడిపోయాయి. గతేడాది ఇదే సెప్టెంబర్‌లో 1.60 లక్షల యూనిట్ల అమ్మకాలు చేసిన మారుతి సుజుకి గడిచిన నెలలో కేవలం 86,380 యూనిట్లకు పరిమితమయ్యింది. ఏడాది పాటు జరిగే మొత్తం అమ్మకాల్లో పండుగ సీజన్ వాటా 40 శాతంగా ఉంటుంది. గడిచిన సెప్టెంబర్‌లో మారుతి సుజుకి అమ్మకాలు 57 శాతం, హ్యుందారు విక్రయాలు 34 శాతం, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 52 శాతం చొప్పున పడిపోయాయి. ఇందుకు చిప్‌ల కొరతనే ప్రధాన కారణమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. మలేషియాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ కూడా చిప్‌ల కొరతకు కారణంగా ఉందని ఆ వర్గాలు తెలిపాయి. వాహనాల నుంచి కంప్యూటర్లు, సెల్ఫోన్లతో పాటు ఇతరత్రా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో సెమీకండక్టర్లుగా వ్యవహరించే సిలికాన్ చిప్‌లను వాడుతున్నారు. ఆయా ఉత్పత్తులు వివిధ పనులను సక్రమంగా నిర్వర్తించేందుకు చిప్‌లు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో కొత్త వాహనాల రూపకల్పనలో సెమీకండక్టర్ల వాడకం భారీగా పెరిగింది. కీలకమైన చిప్‌లకు కొరత నెలకొనడంతో అంతర్జాతీయంగా ఆటోమోటివ్ సహా ఇతర పరిశ్రమలపైనా ప్రభావం పడుతోంది. దీంతో అవి ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.