Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మిడ్డే మీల్' లో వేరుగా కూర్చోబెట్టిన వైనం
- యూపీలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన
లక్నో : యోగి పాలనలో దళితుల పట్ల కులవివక్ష కొనసాగుతున్నది. దళితుల పట్ల దాడులు, వారిని కించపరిచే చర్యలు రాష్ట్రంలో ఇప్పటికే అనేక ఘటనల్లో జరిగాయి. కానీ, యోగి సర్కారు మాత్రం దళితుల విషయంలో వారికి సామాజిక భద్రతను కల్పించే విధంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దీంతో దళితుల పట్ల దారుణాలు అలాగే కొనసాగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దళిత విద్యార్థులకు అవమానం జరిగింది. మిడ్డే మీల్లో భాగంగా ఇతర విద్యార్థులతో పాటు కాకుండా వారికి వేరుగా భోజనాలు పెట్టారు. ఈ ఘటన అమేథి జిల్లాలోని గడేరీ గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకున్నది. కాగా, తమ చిన్నారులను వేరుగా కూర్చోబెట్టి వివక్ష చూపించారన్న పాఠశాల ప్రిన్సిపల్ తీరుపై గడేరీ గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు జగ్నారాయణ్, సోనులో శంగ్రమ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్.. మధ్యాహ్న భోజనం సమయంలో తమ చిన్నారులను ఇతర విద్యార్థులతో( పెత్తందారీ కులాల చిన్నారులు) కాకుండా వేరుగా కూర్చోబెట్టారని వారు పేర్కొన్నారు. చిన్నారులను ప్రత్యేక లైన్లలలో నిలబడాలని పాఠశాల యాజమాన్యం తమను బలవంతం చేసిందన్న విషయాన్ని పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలిపారన్న విషయాన్ని వివరించారు. అంతేకాకుండా, తమ చిన్నారులను పాఠశాల ప్రిన్సిపల్ కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించేవాడని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపల్ కుసుమ్ సోని సస్పెండ్ అయ్యారు. ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.