Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీ, శాస్త్రిలకు రాష్ట్రపతి, ప్రధాని, ఏచూరి ప్రభృతుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ ఇరువురు మహనీయులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితర నేతలు శనివారం నివాళులర్పించారు. ఢిల్లీలోని గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి స్మారకాలైన రాజ్‌ఘాట్, విజరుఘాట్‌ను వారు సందర్శించి సమాధులపై పుష్పగుచ్చాలు ఉంచి కొంతసేపు మౌనం పాటించారు. ''గాంధీజీ పోరాటం, త్యాగాలను స్మరించుకోవాల్సిన ప్రత్యేక రోజు ఇది. గాంధీ బోధనలు, ఆదర్శాలు, జీవిత విలువలను పాటిస్తూ.. ఆయన కలలు కన్న దేశాన్ని రూపొందించడానికి మనమంతా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం'' అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. లాల్‌బహదూర్ శాస్త్రి నిరాడంబరత, ప్రవర్తన, చిత్తశుద్ధి దేశ పౌరులందరికీ సూర్ఫిదాయకమన్నారు. ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. గాంధీ ఆచరించిన సూత్రాలు సమకాలీన ప్రపంచానికి అవసరమని, లక్షలాది మందికి బలాన్ని చేకూరుస్తాయని అన్నారు. విలువలతో కూడిన లాల్‌బహదూర్ శాస్త్రి జీవితం పౌరులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. ''విజయం సాధించేందుకు ఒక్క సత్యాగ్రహి చాలు'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 'ఫార్మర్స్ ప్రొటెస్టు' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు, గాంధీజీ నిర్వహించిన సత్యాగ్రహానికి సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్టుచేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నేతలు గాంధీజీ జయంతి సందర్భంగా ట్వీట్లు చేశారు. 'విశ్వాసం, కులం, వర్ణం, మతం, లింగం, జాతితో సంబంధం లేకుండా ప్రజలందరికీ చెందిన దేశం కోసం గాంధీ చేసిన కృషి మరువలేనిదని, గాంధీ చూపిన మార్గాన్ని ఆయన హంతకులు చంపలేరని' సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా గాంధీకి నివాళి అర్పించారు.అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో గాంధీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు.