Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి హక్కులు అమలైతేనే సమ న్యాయానికి అర్థం
- న్యాయ నాణ్యతపైనే ప్రజాస్వామ్య నాణ్యత
- నల్సా ప్రచార కార్యక్రమంలో సీజేఐ ఎన్.వి.రమణ
- మాతృభాషతోనే న్యాయం : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
న్యూఢిల్లీ : బలహీన వర్గాల సంక్షేమం ద్వారానే అందరి అభివృద్ధి సాధ్యమని, మహాత్మా గాంధీ కూడా అదే భావనను బలంగా విశ్వసించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సా పాట్రాన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకుగాను నేషనల్ లీగల్ సర్వీస్ అథారటీ (నల్సా) ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి విజ్ఞాన భవన్లో ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నల్సా పాట్రాన్ ఇన్ చీఫ్, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడారు. ఈ రోజు ప్రపంచంలోనే చారిత్రాత్మక దినమనీ, మహాత్మునితత్వం, బోధనలు స్వతంత్ర, సహనశీల, స్వయం ఆధారిత భారతదేశానికి మార్గాన్ని రూపొందించడమే కాకుండా, అనేక ఆధునిక నాగరికతలను రూపొందించిందని తెలిపింది. నేటికీ మహాత్ముని బోధనలు మానవాళిని రేపటి దిశగా నడిపిస్తూనే ఉన్నాయని అన్నారు. గాంధీజీ అంత్యోదయ ద్వారా సర్వోదయ భావనను బలంగా విశ్వసించారని, అంటే సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం ద్వారా అందరి అభివృద్ధి అని పేర్కొన్నారు.
సమాన న్యాయానికి అర్థం లేదు
బలహీన వర్గాల హక్కులు అమలు చేయకపోతే, సమాన న్యాయానికి ఇచ్చిన హామీ అర్థ రహితమని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం ఒకదానికొకటి భర్తీ చేస్తాయని, ఉద్యోగం, వారసత్వం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటారని అన్నారు. రోజువారీ వేతనం కోల్పోవడం, నివాసాలు తొలగించడం, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, రెండో పూట అన్నం దొరుకుతుందా లేదా అనే అనిశ్చితి వంటి ఈ సమస్యలన్ని న్యాయం అందకపోవడం వల్లనే వస్తాయని అన్నారు. దీనికి సమాజం ఎంత మూల్యం చెల్లిస్తోందో ఊహించలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని మూడు రాజ్యాంగ వ్యవస్థలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు కలిసి భవిష్యత్తులో సమానత్వం, న్యాయం ఆధారంగా పోరాడుతున్నాయని అన్నారు. ముందుగా చట్టపరమైన అవగాహన కల్పించడం న్యాయం చేరువలో కీలకమన్నారు. అణగారిన వర్గాలు తమ హక్కుల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే, వారు తమ భవిష్యత్తును నిర్మించుకోగలరని అన్నారు.
న్యాయ నాణ్యతపైనే ఆధారపడి ఉంది
ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలను నిలబెట్టేది ప్రజల విశ్వాసం, నమ్మకమేనని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని మనం సంపాదించాలని సూచించారు. న్యాయ నాణ్యతపైనే ప్రజాస్వామ్యం నాణ్యత ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన న్యాయ వ్యవస్థ అవసరమని, కోవిడ్ -19 న్యాయ వ్యవస్థతో సహా అనేక వ్యవస్థలకు అనేక సమస్యలను సృష్టించిందని పేర్కొన్నారు. వేలాది కేసులు వివిధ కోర్టుల్లో పేరుకుపోయాయని అన్నారు. కోర్టుల్లో భారీ ఖాళీలు, కోర్టులు పనిచేయకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో వర్చువల్ విచారణకు సౌకర్యాలు లేకపోవడం వంటివి కాకుండా, మహమ్మారి కొన్ని లోతుగా పాతుకుపోయిన సమస్యలను బహిర్గతం చేసిందని తెలిపారు.
మాతృభాషతోనే న్యాయం : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
మాతృభాషలతోనే ప్రజలకు న్యాయం చేరువ అవుతుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం పునాదిగా ఉన్న సమాజాన్ని మన స్వాతంత్య్ర సమరయోధులు కాంక్షించారని, ఆ ప్రాథమిక సూత్రాలు మన రాజ్యాంగానికి వన్నె తెచ్చాయని పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ విజ్ఞాన భవన్లో దేశవ్యాప్తంగా ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు నేషనల్ లీగల్ సర్వీస్ అథారటీ (నల్సా) ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు.
ఆరు వారాల పాటు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి సంచికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ గాంధీ మహత్ముని పుట్టిన రోజు నల్సా ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. మహత్ముడు మానవ సేవకు, అణగారిన వర్గాలకు న్యాయ సేవలు అందించేందుకు ప్రతిరూపమని కొనియాడారు. ఉత్తమమైన న్యాయ సేవలు నిరుపేదలకు తక్కువ ధరకు అందుబాటులో ఉండాలని గాంధీ ఆనేవారని, ఈ సలహాను సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని సీనియర్ న్యాయవాదులు పాటించాలని సూచించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు వారి హక్కులు పొందేందుకు అవసరమైన అవగాహనను న్యాయ సేవ సంస్థలు అందించాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.