Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుణాచల్‌ప్రదేశ్‌లో హక్కుల కార్యకర్తలు అరెస్టు
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాందూపై అవినీతి ఆరోపణలు చేసిన వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసింది. మార్ఫింగ్ చేసిన రాష్ట్ర సీఎం ఫొటోలను సామాజిక మాధ్యమంలో షేరింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ముగ్గురు హక్కుల కార్యకర్తల్ని అత్యంత రహస్యంగా నిర్బంధించారు. జులై 20న జరిగిన అరెస్టు సంగతి ఎక్కడా మీడియాకు తెలుపకుండా కేంద్రంలోని మోడీ సర్కార్, అరుణాచల్‌లోని బీజేపీ సర్కార్ దాస్తోంది. ప్రధాన మీడియాలో ఎక్కడా దీనికి సంబంధించిన వార్తలు లేకపోవటం చర్చనీయాంశమైంది. మార్ఫింగ్ చేసిన సీఎం ఫొటోలను వాట్సాప్‌లో షేర్ చేసినందుకు ఈ అరెస్టులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన హక్కుల కార్యకర్తల్లో ఒకరైన నాబమ్ తాగమ్, అరుణాచల్ ప్రదేశ్ జస్టిస్ ఫోరం అనే సంస్థకు చైర్మెన్‌గా ఉన్నాడు. రాష్ట్ర సీఎం పెమా ఖాందూపై గతంలో పలు అవినీతి ఆరోపణలు చేశారు. వీటిపై సీబీఐ విచారణ జరపాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సీఎంపై అవినీతి ఆరోపణలు చేసినందుకే తనపై, తనతోపాటు పనిచేస్తున్న మరో ఇద్దరు హక్కుల కార్యకర్తలపై దేశద్రోహం కేసులు పెట్టారని తాగమ్ వెబ్ న్యూస్ పోర్టల్ 'ద వైర్'కు తెలిపారు.