Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలతో అట్టుడికిన హర్యానా, పంజాబ్
- సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసనలు
- అన్నదాతపై పోలీసుల దౌర్జన్యం
- ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం
- ధాన్యం కొనుగోలుకు అంగీకారం
న్యూఢిల్లీ : అన్నదాతలపై హర్యానాలోని బీజేపీ పోలీసులు మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. రైతులపై లాఠీలతో జులం ప్రదర్శించారు. జలఫిరంగులను ప్రయోగించి రైతులపై దాష్టీకానికి పాల్పడ్డారు. ధాన్యం సేకరణలో జాప్యాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానాలో శనివారం కూడా భారీ ఆందోళనలు జరిగాయి. ఆందోళనలు శాంతియుతంగా జరిగాయి. వేలాది మంది రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపులో భాగంగా శనివారం హర్యానా, పంజాబ్‌ల్లో ముఖ్య మంత్రులు, మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. హర్యానా ముఖ్య మంత్రి మనోహార్‌లాల్ ఖట్టర్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్న వేలాది మంది రైతుల పట్ల పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. రైతులపై పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. రైతు ఆందోళన నేపథ్యంలో కర్నాల్‌లో ముఖ్యమంత్రి నివాసం ఎదుట పోలీసులు ముందుగానే బారీకేడ్లు ఏర్పాటుచేశారు. శనివారం ఉదయమే సీఎం ఇంటికి చేరుకున్న రైతులు బారికేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వందలాది మంది రైతులు పోలీసు బారికేడ్లపై నిల్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భివానీలో వ్యవసాయ మంత్రి నివాసాన్ని ముట్టడించారు. సోనేపట్, జింద్, సిర్సా, కురుక్షేత్రం, పానిపట్, అంబాలా, యమునానగర్, పంచకులతో పాటు ఇతర ప్రదేశాలలో కూడా ఆందోళనలు జరిగాయి. కోపంతో ఉన్న రైతులు కర్నాల్, కైతాల్‌లో మండి కమిటీ కార్యాలయాలను మూసివేశారు. పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతుల నుంచి నిరసనలను ఎదుర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జలంధర్, గురుదాస్‌పూర్, హోషియార్పూర్, పటియాలాతో పాటు ఇతర జిల్లాలలో ఆందోళనలు జరిగాయి. మాన్సా, సంగ్రూర్ వంటి కొన్ని ప్రదేశాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిగాయి.
దిగొచ్చిన కేంద్ర సర్కార్
రైతులు ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అంగీకరించింది. హర్యానా, పంజాబ్‌లో రైతులు తమ నిరసనలను తీవ్రతరం చేయడంతో ధాన్యం కొనుగోళ్లు ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి ప్రకటించారు. 'ఇది రైతుల ఐక్య పోరాటం విజయం' అని ఎస్కేఎం పేర్కొంది.
గాంధీ జయంతి సందర్భంగా ఉపవాస దీక్షలు
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎస్కే ఉపవాసదీక్షలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఆందోళనల్లో ఉపవాస దీక్షలు నిర్వహించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ''జై జవాన్, జై కిసాన్'' నినాదం రైతుల ఉద్యమంలో ఈనాటికీ ప్రతిధ్వ నిస్తుందని రైతు నేతలు తెలిపారు. బీహార్‌లోని చంపారన్ నుంచి వారణాసి వరకు 18 రోజుల పాదయాత్ర చారిత్రాత్మక చంద్రహియా గ్రామానికి చేరుకుంది. ఈ యాత్ర అక్టోబర్ 20న ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిలో ముగుస్తుంది. అదేవిధంగా, ఉత్తరాఖండ్‌లోని ఉద్ధమ్ సింగ్ నగర్‌లోని రుద్రపూర్ నుంచి నిరసన తెలిపే రైతుల యాత్ర బయలుదేరింది. హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, ఝాజ్జర్‌లో బీజేపీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక రైతులు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర హాం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనికి వ్యతిరేకంగా టికునియా, లఖింపూర్ ఖేరిలో నల్ల జెండాలతో రైతులు నిరసన తెలపనున్నారు.