Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ విజృంభణ సమయంలో దేశంలో నెలకొన్న మెడికల్ ఆక్సిజన్ కొరతపై ఒక కమిషన్‌తో ఉన్నతస్థాయి విచారణ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఢిల్లీకి చెందిన వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ డివై.చంద్రచూడ్, వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. కరోనా రెండో దశ సమయంలో పలు రాష్ట్రాల్లో నెలకొన్న ఆక్సిజన్ కొరత కారణంగా పదుల సంఖ్యలో కరోనా రోగులు మరణించారని పిటిషన్ పేర్కొంది. ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేకపోవడంపై సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థ చేత కోర్టు పర్యవేక్షణలో విచారణ చేయించాలని పిటిషన్‌దారు న్యాయస్థానాన్ని కోరారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కమిషన్ ద్వారా ఉన్నతస్థాయి విచారణ చేయించాలని అభ్యర్థించారు. పిటిషన్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ), పలు రాష్ట్రాల ఆరోగ్య విభాగాలను ప్రతివాదులుగా చేర్చారు. ప్రజల ఆరోగ్యాన్ని చూసుకోవడం ప్రభుత్వాల ప్రాథమిక విధి అని, సుప్రీంకోర్టు పలు తీర్పుల సందర్భంగా ఆరోగ్య హక్కును కూడా ప్రస్తావించిందని పిటిషన్ పేర్కొంది.