Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రకాశ్ కారత్
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ప్రకాశ్ కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యం మ్యూజియంగా మారనున్నదా? అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. '' మోడీ పాలనలో నూతన సెంట్రల్ విస్టా నిర్మాణం కొనసాగుతున్నది. పాత పార్లమెంటు భవనం మ్యూజియంగా మారనున్నదని కేంద్రం చెప్తున్నది. మరీ, మన ప్రజాస్వామ్యం కూడా మ్యూజియంగా కానున్నదా?'' అని ఆయన అన్నారు. పార్టీ 23వ యూపీ రాష్ట్ర సమావేశంలో భాగంగా యూపీలోని అలహాబాద్‌లో నిర్వహించిన ఓపెన్ సెషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష పార్టీలైన సీపీఐ, లోక్తాంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ చేసిన అపూర్వ కృషిని వారు గుర్తు చేశారు. ఈ సమావేశంలో ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ.. కార్పొరేటీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రజలకు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో ఆయన వివరించారు. '' పబ్లిక్ సెక్టార్‌ను అమ్మితే.. మనకు ఆర్థిక సార్వభౌమత్వం ఉండదు. ఫలితంగా రాజకీయ సార్వభౌమత్వాన్నీ మనం ఆశించలేం'' అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా ప్రజలను కదలించడానికి గాంధీ చేసిన సత్యాగ్రహ విధానం చాలా ప్రభావవంతమైందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో మెంబర్, ఐద్వా అధ్యక్షురాలు సుభాషిణీ అలీ అన్నారు. కానీ, ప్రస్తుతం దేశంలో కుల వివక్ష, దళిత మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు, యూపీలో చోటుచేసుకున్న హత్రాస్, ఉన్నావో ఘటనలే నిదర్శనమని తెలిపారు. యూపీలో వర్ణ వ్యవస్థ కొనసాగుతున్నదనీ, మేయిన్పురీ, అమేథీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్డే మీల్లో ఇటీవల దళిత చిన్నారులను వేరుగా కూర్చోబెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఇలాంటి వ్యవస్థను ఎదుర్కోవాలంటే అంబేద్కర్ జీవితాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ ప్రతినిధి నసీమ్ అన్సారీ తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారిపై హింసాత్మకంగా వ్యవహరించడమే ఆరెస్సెస్ అనుబంధ సంస్థల పని అని ఎల్జేడీ నాయకుడు జుబేర్ అన్నారు. రాష్ట్ర సమావేశం నేడూ (సోమవారం) కొనసాగుతుంది. సీపీఐ(ఎం) జనరల్ సెక్రెటరీ సీతారామ్ ఏచూరీ పాల్గొని పార్టీ అంతర్గత సభ్యత్వంతో పాటు పలు విషయాలపై రివ్యూ నిర్వహించనున్నారు.