Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టీఎంసీ ఖాతాలో మరో రెండు
- ఒడిశాలో బిజూ జనతాదళ్ అభ్యర్థి గెలుపు
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ భవానీపూర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్‌పై 58,832 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం పోలైన 1,17,875 ఓట్లలో మమతకు 85,263 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 26,428 వచ్చాయి. సీపీఐ(ఎం) అభ్యర్థి శ్రీజీబ్ బిశ్వాస్కు 4,226 ఓట్లు వచ్చాయి. భవానీపూర్‌తో పాటు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన సంసర్‌గంజ్, జాంగిపూర్ స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక ఒడిశాలోని పిపిలి స్థానంలో బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థి రుద్ర ప్రతాప్ బీజేపీ అభ్యర్థి ఆశ్రిత్ పట్నాయక్‌పై దాదాపు 20 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు గతనెల 30వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో మొదటి రౌండ్ నుంచి భవానీపూర్‌లో మమత అధిక్యత ప్రదర్శించారు. తాజా విజయంతో సీఎంగా కొనసాగేందుకు మమతకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. నాలుగు నెలల క్రితం జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 1,956 ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినా టీఎంసీ ఎమ్మెల్యేలు ఆమెను తమ శాసనపక్ష నేతగా ఎన్నుకోవడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎంగా గెలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆరు నెలల లోపు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో మమత విజయం సాధించారు. ఉపఎన్నికల ఫలితాలపై కోల్‌కతాలోని తన నివాసం వద్ద మమత మీడియాతో మాట్లాడుతూ ఈ ఫలితాలు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరింతగా పనిచేసేందుకు ప్రోత్సాహం అందిస్తాయని పేర్కొన్నారు.
నందిగ్రామ్‌లో తనను ఓడిచేందుకు పన్నిక కుట్రకు వ్యతిరేకంగా ప్రజలు తనకు ఈ విజయం ఇచ్చారని అన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక స్పందిస్తూ.. ఫేక్ ఓటర్ల వలనే తాను ఓటమి పాలయ్యాయని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 కంపెనీల కేంద్ర బలగాలతో ఎన్నికల సంఘం గట్టి భద్రత ఏర్పాటు చేసింది. అదేవిధంగా మొత్తం ప్రాంతాన్ని సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచింది. కాగా, హింస భయాందోళనల నేపథ్యంలో విజయోత్సవాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘం ఆదివారం మధ్యాహ్నం పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాసింది. కౌంటింగ్ సందర్భంగా మమత లీడ్‌లో ఉండగానే టిఎంసి కార్యకర్తలు పలు ప్రాంతాల్లో బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈసి ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాసింది.