Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలంతా ప్రతిఘటించాలి : ఏపీ విద్యుత్ ఉద్యోగుల సదస్సులో వక్తలు
అమరావతి : కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2021తో పేద ప్రజలు ప్రభుత్వం నుంచి పొందే సబ్సిడీలు పోతాయని విద్యుత్ ఉద్యోగుల సదస్సులో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్ట సవరణ ఉపసంహరించాలని, జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల ప్రయివేటీకరణ నిలిపివేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(యుఇఇయు) యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (యూఈసీడబ్ల్యూయూ) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఎంబి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ ఎంప్లాయిస్ జాతీయ కన్వీనర్ ప్రశాంత్ ఎన్ చౌదరి హాజరై మాట్లాడారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ వల్ల విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. ఇప్పుడున్న విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి చేస్తోందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులపై రూ.4వేలు అదనపు భారం పడనుందని చెప్పారు. సెల్‌ఫోన్‌లాగా రీచార్జ్ చేయికపోతే వెంటనే విద్యుత్ ఆగిపోతుందని తెలిపారు. ఇలాంటి విధానాల వల్ల పేదలను విద్యుత్‌కు దూరం చేసే పరిస్థితులు వస్తాయని చెప్పారు. ప్రయివేటీకరణ వల్ల వచ్చే నష్టాలను అన్ని వర్గాల ప్రజలకు వివరించి ఐక్య పోరాటానికి సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే కేంద్రప్రభుత్వాన్ని ఎదుర్కొగలమని తెలిపారు. సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ మాట్లాడుతూ విద్యుత్ చట్ట సవరణ బిల్లు, స్మార్ట్ ప్రిపేయిడ్ మీటర్ల ఏర్పాటుకు బిజెపి రాష్ట్రాల కంటే ముందే సీఎం జగన్ మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు. ప్రపంచ బ్యాంకు ఒప్పందంలో భాగంగానే ఎలక్ట్రిసిటీ బోర్డును గతంలో మూడు ముక్కలు చేశారని అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్ర సమయంలో విద్యుత్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, వారి సమస్యలు పరిష్కారిస్తా మని హామీనిచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగుల డిమాండ్లను పీడీఎఫ్ తరపున బలపరుస్తున్నామని వెంకటేశ్వరరావుతో పాటు ఎమ్మెల్సీలు షేక్ సాబ్జీ, వై శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. యుఇఇయు రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు, యుఇసిడబ్ల్యూయు ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుల్లో ఎపిఇఎస్డబ్ల్యూయు అధ్యక్షులు బి రామ లింగారెడ్డి, ఎపి రాష్ట్రప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి చైర్మన్ ఎవి నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.
పలు తీర్మానాలకు ఆమోదం
విద్యుత్ సవరణల చట్ట-2021ని రద్దు చేయాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, పీస్‌రేట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఆర్సి ఏర్పాటు, 4విడతల డీఏ విడుదల చేయాలని తదితర డిమాండ్లతో యుఇఇయు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగబ్రహ్మచారి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సదస్సు ఆమోదించింది. నవంబర్‌లో డివిజన కార్యాలయాల వద్ద సామూహిక రాయబారం, డిసెంబర్లో ఎస్ఇ కార్యాలయాల వద్ద నిరాహారదీక్షలు, జనవరిలో జాతాలు, కంపెనీ కార్యాలయాల వద్ద ధర్నా, ఫిబ్రవరిలో చలో విజయవాడ చేపట్టాలని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే కలిసొచ్చే సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు వెళ్లాలని సదస్సు పిలుపునిచ్చింది.