Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 29న కేంద్ర క్యాబినెట్ పాఠశాలల్లో పీఎం పోషన్ జాతీయ పథకాన్ని' ఆమోదించింది. అయితే, ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందుబాటులో లేనప్పటికీ.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా కవర్ చేయబడింది. అయితే, పీఎం పోషన్ పథకం మధ్యాహ్న భోజన కార్యక్రమం మాదిరిగా కొత్త పేరుతో ముందుకు వచ్చింది. కొత్త పాత్రలో ప్రభుత్వ పాత భోజనం అనే తరహాలో వుండవచ్చునంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు 2001లో ఆహార హక్కు కేసులో తీర్పునిస్తూ.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలందరికీ ప్రతి పాఠశాల పని దినంలో తప్పనిసరిగా వేడివేడిగా వండిన భోజనం అందించాలని ఆదేశించింది. తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలల్లో వండిన భోజనాన్ని అందిస్తుండగా.. ఇతర రాష్ట్రాలలో నెలకు ఒకసారి నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ కింద పాఠశాలల్లో రేషన్ బియ్యం పంపిణీ కొనసాగింది. దీనిని 2004లో ప్రభుత్వం సవరించి.. వండిన భోజనం ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు 2007ను అందిస్తోంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో 1-8 తరగతిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడం కూడా ఈ చట్టం కింద ఉన్న అర్హతలలో ఒకటి. చట్టం షెడ్యూల్ 2 భోజనంలో కనీస కేలరీలు, ప్రోటీన్ల వివరాలను తెలియజేస్తుంది.
ప్రభుత్వం అమలు చేసిన ఉత్తమ సంక్షేమ పథకాల్లో మధ్యాహ్న భోజన పథకం ఒకటి. పాఠశాలలో వండిన భోజనం అందించడం వలన బడుల్లో పిల్లల నమోదు, హాజరు పెరుగుతుంది. అలాగే, విద్యార్థుల ఆకలి సమస్యను పరిష్కరించడానికి దోహదం చేస్తుంది, పిల్లలలో పోషకాహారాన్ని మెరుగుపరుస్తుంది. అయితే, గత కొన్నేండ్లుగా ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇటీవల చేసిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం తల్లి ఆరోగ్యం, విద్యా స్థాయిలను మెరుగుపరచడం ద్వారా పిల్లల పోషణపై తరతరాలుగా ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో, ఈ పథకం నిర్లక్ష్యం చేయబడింది. భోజన నాణ్యతను మెరుగుపరచడం, మెరుగైన మౌలిక సదుపాయాలను సృష్టించడం, జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ కోసం బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం కోసం అవసరమైన సంస్కరణలు చేపట్టబడలేదని తెలిపింది.ఇక ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం పీఎం పోషన్ ప్రకటన కొత్త పాత్రలో పాత భోజనం కావచ్చునని అనే అనుమానం కలిగిస్తోంది. 2021-22 నుంచి 2025-26 వరకు ఐదేండ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం వ్యయం రూ.54061.73 కోట్లు ఉంటుందని పేర్కొంది. మధ్యాహ్న భోజన పథకానికి సమానమైన బడ్జెట్ కేటాయింపు 020-21 రూ.11,000 కోట్లు, 2021-22కి ఇది రూ .11,500 కోటు ఉంది. అందువల్ల, ఇచ్చిన మొత్తం రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ పథకం కోసం బడ్జెట్లో ఎటువంటి పెరుగుదలను చూడలేమని సూచిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్ నిలిచిపోవడంతో మధ్యాహ్న భోజన పథకం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆర్థికవేత్త జీన్ డ్రోజ్ అంచనా ప్రకారం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకునీ, మధ్యాహ్న భోజన పథకానికి కేటాయింపు 2014-2021 సంవత్సరాల మధ్య 32.3శాతం తగ్గింది. కాబట్టి ఇలాంటి బడ్జెట్ కేటాయింపులతో ప్రస్తుత మధ్యాహ్న భోజన పథకంలో పెద్ద మార్పును ఆశించలేము.